జనం న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే ఫిబ్రవరి నెలలోనే ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈనెలలోనే షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదల చేసి ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పంచాయతీ పోరు ముగిసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఎన్నికల నగారా మోగనుంది.మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వీలైంత త్వరగా ఎన్నికలు నిర్వహించి కొత్త పాలక వర్గాలకు బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫిబ్రవరి నెలలోనే ఈ ఎన్నికల తతంగం పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో సంక్రాంతి తర్వాత ఎప్పుడైనా షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం, మరోవైపు ఎన్నికల సంఘం తీసుకుంటున్న నిర్ణయాలే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. అలాగే బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగుతారని సమాచారం. ఓటరు జాబితాల సవరణ షెడ్యూల్ విడుదల మున్సిపల్ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహకాలు మొదలుపెట్టింది. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు,మున్సిపల్ కార్పొరేషన్ల ఓటర్ల జాబితాలను సవరణ చేసే పనిలో పడింది. డిసెంబర్ 30 నుంచి జనవరి 10 వరకు ఓటరు జాబితా తయారీకి కసరత్తు చేయనుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి ఓటరు జాబితాల సవరణ, ప్రచురణ షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆ వివరాలు. మున్సిపాలిటీ/మున్సిపల్ కార్పొరేషన్ల వారీగా పోలింగ్ కేంద్రాలను డేటా పునర్వ్యవస్థీకరణ – 2025 డిసెంబర్ 30 మున్సిపాలిటీ/మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాల డేటా పునర్వ్యవస్థీకరణ-2025 డిసెంబర్ 31, మున్సిపాలిటీ/ మున్సిపల్ కార్పొరేషన్ వార్డుల వారీ పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల జాబితా పునర్వ్యవస్థీకరణ -2025 డిసెంబర్ 31, మున్సిపాలిటీ/ మున్సిపల్ కార్పొరేషన్‌లలోని పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల జాబితాను నోటటీసు బోర్డులపై ప్రదర్శించడం. పేర్లు, చిరునామాల్లో ఏవైనా తప్పులుంటే అభ్యంతరాలను స్వీకరించడం – 2026 జనవరి 1, మున్సిపాలిటీ/కార్పొరేషన్ స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సంబంధిత కమిషనర్ల సమావేశం – 2026 జనవరి 5, జిల్లా స్థాయిలో జిల్లా ఎన్నికల అధికారుల ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలతో సమావేశం – 2026 జనవరి 6, మున్సిపాలిటీలు/ మున్సిపల్ కార్పొరేషన్లలో పోలింగ్ కేంద్రాల వారీగా ఓటరు జాబితాల తుది ప్రచురణ – 2026 జనవరి 10,