కాళేశ్వరాన్ని మేం అడ్డుకోలేదు!

పయనించే సూర్యుడు న్యూస్ : గోదావరి జలాల వినియోగంపై ప్రస్తావిస్తూ, తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం విషయంలో తాను ఎప్పుడూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని తెలిపారు. అదే విధంగా నల్లమల సాగర్ ప్రాజెక్టుపై కూడా అనవసర రాజకీయ వాదోపవాదాలు వద్దని సీఎం చంద్రాబాబు సూచించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం–నల్లమల సాగర్ ప్రాజెక్టులపై ఎలాంటి అపోహలు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుల వల్ల ఎవరికీ నష్టం జరగదని, సముద్రంలో కలిసిపోతున్న నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడమే తమ లక్ష్యమని వివరించారు. గోదావరి జలాల వినియోగంపై ప్రస్తావిస్తూ, తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం విషయంలో తాను ఎప్పుడూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని తెలిపారు. అదే విధంగా నల్లమల సాగర్ ప్రాజెక్టుపై కూడా అనవసర రాజకీయ వాదోపవాదాలు వద్దని సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరే విధంగా ప్రాజెక్టులు అమలవ్వాలని ఆకాంక్షించారు. పరస్పర సహకారంతోనే జలవనరుల సమగ్ర వినియోగం సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. నదుల అనుసంధానం అంశంపై కూడా సీఎం ప్రత్యేకంగా మాట్లాడారు. వంశధార నుంచి పెన్నా వరకు నదులను అనుసంధానించాలన్నది ప్రభుత్వ దీర్ఘకాలిక లక్ష్యమని ఆయన వెల్లడించారు. ఆ లక్ష్యం సాధ్యమైతే రాష్ట్రంలో నీటి కొరత సమస్య శాశ్వతంగా తొలగిపోతుందని ఆయన పేర్కొన్నారు. నదుల అనుసంధానం విజయవంతమైతే తెలుగు తల్లికి జలహారతి ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు. నీరు సమృద్ధిగా ఉంటే వ్యవసాయం, పరిశ్రమలు, ఉపాధి వంటి అనేక రంగాలు పురోగమిస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సాగునీటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇప్పటివరకు సుమారు రూ.20 వేల కోట్లు వెచ్చించామని సీఎం వెల్లడించారు. గతంలో ఎన్డీయే ప్రభుత్వ హయాంలో, అలాగే ఎన్టీఆర్ నాయకత్వంలో మాత్రమే ప్రాజెక్టులు పూర్తయ్యాయని గుర్తుచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పాలనలో సాగునీటి రంగానికి తగిన ప్రాధాన్యం దక్కలేదని ఆయన విమర్శించారు. అలాగే వెలిగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టుకు తానే శంకుస్థాపన చేసినట్లు, దానిని పూర్తిచేయడం కూడా తన బాధ్యతగా తీసుకున్నట్లు తెలిపారు. రైతులకు ప్రతి ఎకరాకు నీరు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. సాగునీటి విస్తరణ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే సందర్భంలో పుష్కరాల ఏర్పాట్లపై కూడా సీఎం స్పందించారు. తన పదవీకాలంలో రెండోసారి పుష్కరాలు నిర్వహించబోతున్నామని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేపడుతున్నామని తెలిపారు. పుష్కరాలు ఆధ్యాత్మిక, సాంస్కృతికంగా రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపును తెస్తాయని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *