సాక్షి డిజిటల్ న్యూస్ : తెలంగాణకు గుండెకాయ అయినటువంటి హైదరాబాద్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా మార్చింది. ఈక్రమంలో జీహెచ్ఎంసీ చట్టానికి త్వరలోనే వీడ్కోలు పలకాలని ప్రభుత్వం నిర్ణయించింది. జీహెచ్ఎంసీ చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం అమలులోకి తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అవుటర్ రింగురోడ్డు పరిధిలోని మూడు కార్పొరేషన్లకు వర్తించేలా గ్రేటర్ హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కోర్ అర్బన్ ప్రాంతంలో అనుమతులు, రుసుమలు, అభివృద్ధి పనుల నిర్వహణ, ఇతర వ్యవహారాలన్నింటికీ ఆ చట్టమే ఆధారంగా ఉండాలని సూచించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మున్సిపల్ శాఖకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న 99 రోజుల కార్యక్రమంలో మున్సిపల్ పరిధిలో చేపట్టే పనులు తొలుత చేపడతామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు పలు ఆదేశాలిచ్చారు. కోర్ అర్బన్ ఏరియాలో ప్రత్యేక డ్యాష్ బోర్డుల ఏర్పాటు ‘కోర్ అర్బన్ ఏరియాలో పారిశుద్ధ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. పలు ప్రాంతాల్లో చెత్త ఎక్కడ వేయాలో తెలియక ప్రజలు ఖాళీ ప్రదేశాల్లో వేస్తున్నారు. ముందుగా చెత్త వేయాల్సిన ప్రాంతాలను గుర్తించి అక్కడ బోర్డులు ఏర్పాటు చేయాలి’అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.‘కోర్ అర్బన్ ఏరియాలో రోడ్ల నిర్మాణ విషయంలో నిర్దేశిత కాలం వరకు ఉండేలా సాంకేతికతను వినియోగించాలి. కోర్ అర్బన్ ఏరియాలో వీధి దీపాలు వెలుగుతున్నాయో లేదో తెలుసుకునేలా డ్యాష్ బోర్డులో కనిపించాలి. ఎక్కడైనా సమస్య ఉంటే దానిని వెంటనే తెలుసుకొని పరిష్కరించాలి’అని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఫైర్ సేఫ్టీకి అత్యధిక ప్రాధాన్యత ‘ఫుడ్ సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. నగరంలోని అన్ని హోటళ్లలోని కిచెన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానించాలి. తరచూ తనిఖీలు తప్పనిసరి చేయడమే కాకుండా, ఫుడ్ సేఫ్టీకి ఆయా హోటళ్లు తీసుకుంటున్న చర్యలను మదింపు చేయాలి’అని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ‘కోర్ అర్బన్ ఏరియాలో ఫైర్ సేఫ్టీకి ప్రధాన్యమివ్వాలి. 50 అంతస్తులకుపైగా భవనాల నిర్మాణాలు జరుగుతున్నందున అగ్ని ప్రమాదాలను అరికట్టేందుకు అవసరమైన అధునాతన సామగ్రి, సాంకేతికతను సమకూర్చుకోవాలి’అని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.