ఇజ్రాయెల్‌లో ప్రధాని మోదీకి విశేష స్వాగతం

* ప్రోటోకాల్‌ను పక్కన పెట్టి మోదీకి ఆతిథ్యం ఇచ్చిన నెతన్యాహు

పయనించే సూర్యుడు న్యూస్ : రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం ఇజ్రాయెల్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆయన సతీమణి సారా నెతన్యాహు ఘన స్వాగతం పలికారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం ఇజ్రాయెల్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆయన సతీమణి సారా నెతన్యాహు ఘన స్వాగతం పలికారు. టెల్ అవీవ్ లోని ఎయిర్ పోర్టుకు స్వయంగా వచ్చిన నెతన్యాహు.. ప్రొటోకాల్ పక్కనపెట్టి మరీ విమానాశ్రయానికి వచ్చి ప్రధాని మోదీని ఆత్మీయ ఆలింగనంతో స్వాగతం పలికాడు. ఇరు దేశాల మధ్య ఉన్న దృఢమైన మైత్రి ఎంత బలమైందని దీని బట్టే అర్థం చేసుకోవచ్చు. మోదీ రాకను పురస్కరించుకుని విమానాశ్రయంలో ప్రత్యేకంగా బ్యాండ్ మేళాలతో ఘనంగా ఆహ్వానించారు. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ ఇజ్రాయెల్‌లో పర్యటించడం ఇది రెండోసారి. 2017లో తొలిసారి ఆయన ఇజ్రాయెల్ గడ్డపై అడుగుపెట్టి చరిత్ర సృష్టించారు. ఇప్పుడు తొమ్మిదేళ్ల తర్వాత తిరిగి అక్కడ పర్యటిస్తుండటంతో ఈ పర్యటనకు అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇజ్రాయెల్ చేరుకున్న వెంటనే మోదీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ఈ చారిత్రక పర్యటన రెండు దేశాల స్నేహానికి, వ్యూహాత్మక భాగస్వామ్యానికి సరికొత్త ఊపునిస్తుందన్న పూర్తి విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ రెండు రోజుల పర్యటనలో భాగంగా మోదీ పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రత్యేకించి ఇజ్రాయెల్ పార్లమెంట్ ‘నెస్సెట్’ను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో ప్రసంగించనున్న తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించనున్నారు. ప్రధాని నెతన్యాహుతో పాటు ఆ దేశ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌తోనూ మోదీ వేర్వేరుగా సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రక్షణ, భద్రత, వ్యవసాయం, నీటి నిర్వహణ, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి కీలక రంగాల్లో ఇరు దేశాలు పలు ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి. దీంతో పాటు ఇజ్రాయెల్‌లో స్థిరపడిన ప్రవాస భారతీయులతో మోదీ ముఖాముఖి సమావేశం అవుతారు. జెరూసలేంలోని హోలోకాస్ట్ స్మారక కేంద్రం ‘యాద్ వాషెమ్’ను కూడా భారత ప్రధాని సందర్శించి నివాళులు అర్పిస్తారు. ఉగ్రవాదంపై పోరులో రెండు దేశాలు అవలంబిస్తున్న జీరో టాలరెన్స్ విధానాన్ని ఈ పర్యటన మరింత బలోపేతం చేయనుందని దౌత్య వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకున్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా గాజాలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మోదీ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లడం భౌగోళిక రాజకీయాల పరంగా ఆసక్తికరంగా మారింది. ప్రపంచస్థాయి సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్ వంటి బలమైన మిత్రదేశాల తోడ్పాటు ఎంతో అవసరమని నెతన్యాహు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. తీవ్రవాద శక్తులను ఎదుర్కొనేందుకు మిడిల్ ఈస్ట్‌లో ఒక సరికొత్త కూటమిని ఏర్పాటు చేసే దిశగా ఇజ్రాయెల్ అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే భారత ప్రధాని పర్యటనను ఒక చారిత్రక ఘట్టంగా ఆ దేశ మీడియా అభివర్ణిస్తోంది. భారత్ ఇకపై పశ్చిమాసియా రాజకీయాల్లో ఒక సాధారణ ప్రేక్షకుడి పాత్రలో లేదని, ఈ ప్రాంత భవిష్యత్తును నిర్దేశించే ప్రధాన శక్తిగా అవతరిస్తోందని స్థానిక పత్రికలు ప్రశంసిస్తున్నాయి. మొత్తానికి భద్రత, ఆవిష్కరణలు, ఉమ్మడి ప్రయోజనాలే పునాదిగా సాగుతున్న ఈ పర్యటన అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామాలకు దారితీస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *