పయనించే సూర్యుడు న్యూస్ : వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనుల ఆలస్యంపై హరీశ్ రావు మండిపడ్డారు. ఫ్యూచర్ సిటీపై సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న సోయి పేద ప్రజల ఆరోగ్యంపై లేదని విమర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు కేంద్ర బిందువైన ‘ఫ్యూచర్ సిటీ’పై ఉన్న శ్రద్ధ, పేద ప్రజలకు ప్రాణం పోసే వరంగల్ ‘హెల్త్ సిటీ’పై ఏమాత్రం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వరంగల్‌లో నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను పార్టీ నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే 24 అంతస్తుల భవన నిర్మాణం దాదాపు పూర్తికాగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పనులను కావాలనే పక్కనపెట్టారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న అక్కసుతోనే ఈ ఆసుపత్రి నిర్మాణాన్ని నత్తనడకన సాగిస్తున్నారని విమర్శించారు. కేవలం కమీషన్లు తెచ్చిపెట్టే ప్రాజెక్టులపైనే సీఎం దృష్టి సారించారని, పేదల ఆరోగ్యానికి భరోసా ఇచ్చే ఆసుపత్రులను గాలికొదిలేశారని దుయ్యబట్టారు. వెంటనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకపోతే వరంగల్ గడ్డపైనే బీఆర్ఎస్ పక్షాన ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరోవైపు సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. ఇటీవల తాము దేవాదుల ప్రాజెక్టును సందర్శించినప్పుడు సమ్మక్క బ్యారేజీలోని 10 మోటార్లకు గాను కేవలం ఆరు మాత్రమే నడుస్తున్నాయన్న వాస్తవాన్ని బయటపెట్టామని గుర్తుచేశారు. ఆ దెబ్బకే ముఖ్యమంత్రికి సోయి వచ్చి హడావిడిగా సమీక్ష నిర్వహించి అన్ని మోటార్లు ఆన్ చేయించారని, ఇది ప్రతిపక్షంగా తాము సాధించిన విజయంగా అభివర్ణించారు. దేవాదుల పనులు పూర్తి చేసే విషయంలో ప్రభుత్వానికి ఏమాత్రం స్పష్టత లేదని, మంత్రులు తలో డెడ్‌లైన్ చెబుతూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. మంత్రి పొంగులేటి 2026 మార్చి అని, ఉత్తమ్ కుమార్ రెడ్డి 2027 మార్చి అని చెబుతుంటే, సీఎం రేవంత్ రెడ్డి ఏమో 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని కొత్త తేదీని తెరపైకి తెచ్చారని విమర్శించారు. పనులు మాత్రం అంగుళం కూడా ముందుకు సాగడం లేదన్నారు. సాగునీటి రంగంపై అసెంబ్లీలో చర్చకు రావాలని సీఎం విసురుతున్న సవాల్‌ను తాము స్వీకరిస్తున్నామని ప్రతిపక్ష నేతలు స్పష్టం చేశారు. దమ్ముంటే అసెంబ్లీలో తమ మైకులు కట్ చేయకుండా, కెమెరాలు పక్కకు తిప్పకుండా ఏ ప్రాజెక్టు మీదైనా ఎన్ని రోజులైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. అసలు ముఖ్యమంత్రికి సొంత క్యాబినెట్ మంత్రులపైనే నమ్మకం లేదని, ఇటీవల జరిగిన సాగునీటి పారుదల శాఖ సమీక్షలో మంత్రి ఉత్తమ్‌ను ఆపి దేవాదులపై అవగాహన ఉన్న కడియం శ్రీహరి సలహాలు తీసుకోవాలని సూచించడం సొంత మంత్రిని అవమానించడమేనని వ్యాఖ్యానించారు. మరోవైపు దేవాదులను పక్కనపెట్టి ఆంధ్రాకు నీళ్లు తరలిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం కేవలం చోద్యం చూస్తోందని ఆరోపించారు. ముందుగా పెండింగ్ పనులు పూర్తి చేసి తెలంగాణ రైతుల పొలాలకు నీళ్లివ్వాలని డిమాండ్ చేశారు. గత కేసీఆర్ పాలనలో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించిన ఆసుపత్రులు నేడు అధ్వాన్నంగా మారాయని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. నాడు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేసిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ఇప్పుడు ఎలుకలు, పందికొక్కులకు అడ్డాగా మారి రోగులను భయభ్రాంతులకు గురిచేస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులపై కక్ష సాధింపు చర్యలు, అక్రమ అరెస్టుల మీద పెడుతున్న శ్రద్ధను ప్రభుత్వం ఆసుపత్రి నిర్మాణాలను పూర్తి చేయడం మీద పెట్టాలని హితవు పలికారు. 2024 దసరాకే ప్రారంభం కావాల్సిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు పాలకుల నిర్లక్ష్యం వల్ల రెండు దసరాలు పోయినా పూర్తికావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యూచర్ సిటీ మీద పెట్టిన శ్రద్ధలో పది శాతం ఇటువైపు పెట్టినా ఎప్పుడో ఆసుపత్రి అందుబాటులోకి వచ్చేదని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి పేదలకు మెరుగైన వైద్యం అందించే దిశగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.