మూసీ అభివృద్ధి వివాదం ముదురుతోంది

* సీఎం రేవంత్‌పై హరీష్ ఘాటు విమర్శలు

పయనించే సూర్యుడు న్యూస్ : మూసీ అభివృద్ధి పేరిట మధ్య తరగతి ఇళ్లను కూల్చి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఏం చేసినా దాని వెనుక రియల్ ఎస్టేట్ దందా ఉంటుందని బీఆర్ఎస్ ముఖ్య నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. గతంలో HCU, HILTP, ఫార్మాసిటీ, ఇప్పుడు మూసీ అభివృద్ధి పేరిట మీ భూములు అదానీ లాంటి వాళ్లకు కట్టబెట్టే కుట్ర చేస్తున్నాడని మండిపడ్డాడు. మూసీ నది సౌందర్యాభివృద్ధి పేరుతో మధ్య తరగతి ప్రజల ఇళ్లను కూల్చేసి ఆ ప్రాంతాలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే భారీ కుట్ర జరుగుతోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. నేడు హైదరాబాద్ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్ మెంట్‌వాసులతో సహా సమీప ప్రాంతాల బాధితులతో ఆయన సమావేశం నిర్వహించారు. అక్కడి నివాసులకు జారీ చేసిన ఇళ్ల ఖాళీ నోటీసులను ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ద్వారా నది అందాలు పెంచడం కాకుండా, కేవలం రియల్ ఎస్టేట్ దోపిడీకి తెరలేపుతోందని దుయ్యబట్టారు. గత బీఆర్ఎస్ పాలనలో మూసీ శుద్ధీకరణ కోసం రూ.3800 కోట్లతో సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు (STP) నిర్మించామని, అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను తీసుకొచ్చేందుకు అప్పట్లోనే డీపీఆర్ సిద్ధం చేశామని ఆయన గుర్తు చేశారు. నాడు ఏ ఒక్కరినీ రోడ్డున పడేయలేదని, ఎవరినీ వలసలు వెళ్లేలా చేయలేదని స్పష్టం చేశారు. బాపు ఘాట్ వద్ద ఉన్న మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్స్ ప్రాంతాన్ని సందర్శించిన హరీశ్ రావు.. ఇళ్లు కోల్పోతున్న బాధిత కుటుంబాలను స్వయంగా పరామర్శించి వారికి భరోసా కల్పించారు. మాజీ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు జి. సుధీర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు తదితర ముఖ్య నేతలతో కలిసి ఆయన బాధితులతో ముచ్చటించారు. ఎన్నో ఏళ్లుగా కష్టపడి, బ్యాంకుల్లో అప్పులు తెచ్చి జీవితకాలపు పొదుపుతో ఇళ్లు కొనుక్కున్న మధ్య తరగతి ప్రజల ఆస్తులను రాత్రికి రాత్రే కూల్చేయడం అత్యంత దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) లేకుండా, ఫుల్ ట్యాంక్ లెవల్ (FTL) సరిహద్దులు నిర్ధారించకుండా, కనీస పర్యావరణ అనుమతులు తీసుకోకుండా ఇళ్లు ఎలా కూలుస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. సామాజిక ప్రభావ మూల్యాంకనం (Social Impact Assessment) చేయకుండా ఏకపక్షంగా ముందుకెళ్లడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు. మూసీ నది ప్రక్షాళనకు బీఆర్ఎస్ పార్టీ ఏమాత్రం వ్యతిరేకం కాదని, కానీ ప్రక్షాళన పేరుతో పేద, మధ్య తరగతి కుటుంబాలను రోడ్డున పడేసి వారిని వలస జీవులుగా మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని హరీశ్ రావు తేల్చి చెప్పారు. సంచలనం సృష్టిస్తున్న హైడ్రా (HYDRAA) కూల్చివేతల నేపథ్యంలో ప్రజలు తీవ్ర భయాందోళనల్లో ఉన్నారని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో ఆ బాధిత కుటుంబాలకు పూర్తి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఈ అక్రమ కూల్చివేతల అంశాన్ని రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రముఖంగా ప్రస్తావిస్తామని, ప్రభుత్వ తీరు మారకపోతే న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామని హరీశ్ రావు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *