పేదల జీవితం మార్చే భారీ ప్రణాళికలు

*మహిళలకు వ్యాపారవేత్తలుగా మార్గం – సీఎం చంద్రబాబు

సాక్షి డిజిటల్ న్యూస్ : ‘పేదల ఆదాయం పెంచుతాం…ఆనందాన్ని పంచుతాం. సంక్షేమం అమలులో ఏపీకి దరిదాపుల్లో ఏ రాష్ట్రమూ రాదు’అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.‘మార్చి నెలాఖరుకు అన్ని పంచాయతీల్లో 100 శాతం చెత్త సేకరణ చేస్తాం.చెత్త విషయంలో జపాన్ తరహాలో అలవాట్లు మార్చుకోవాలి’ అని వినుకొండ స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. పేద ప్రజల ఆదాయాన్ని పెంచి వారి జీవితాల్లో ఆనందాన్ని నింపుతామని… ప్రతి ఒక్కరికి ఆనందం పంచేలా కృషి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజలకు ఆదాయం పెంచే మార్గాన్ని నేర్పించి వారిని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా వినుకొండలో శనివారం నిర్వహించిన స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్రతోనే స్వర్ణాంధ్ర సాధ్యమని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. పల్నాడులో అడుగుపెడితే వచ్చే వైబ్రేషన్ వేరు వినుకొండలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…‘పౌరుషాల గడ్డ పల్నాడులో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. పల్నాడులో అడుగుపెడితే వచ్చే వైబ్రేషనే వేరుగా ఉంటుంది. ఇటీవల కోటప్పకొండలో శివరాత్రి ఉత్సాహంగా జరిగింది. భక్తులతో దద్దరిల్లింది. కోటప్పకొండ తిరునాళ్లు ఘనంగా నిర్వహించారు. శివరాత్రి ప్రభలు అంటే కోటప్పకొండ ప్రభలే గుర్తుకు వస్తాయి. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారాయణ ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా బాగా జరుగుతున్నాయి. నేను గతంలో ముఖ్యమంత్రిగా పచ్చదనం-పరిశుభ్రత, నీరు-మీరు, ఆకస్మిక తనిఖీలు వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాను. స్వచ్ఛాంద్ర అంటే రోడ్లు ఊడ్చే కార్యక్రమం కాదు. స్వచ్ఛత మన జీవిన విధానంలో భాగం కావాలి’ అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. పరిసరాల శుభ్రత.. మన బాధ్యత ‘రాష్ట్రంలోని ప్రతి మండలానికో స్వచ్ఛ రథం ఏర్పాటు చేస్తున్నాం. వారానికోసారి రథాలు గ్రామానికి వస్తాయి. ఇళ్లలో పనికి రాని వస్తువులు ఇస్తే బదులుగా నిత్యావసర వస్తువులు ఇస్తారు. అన్నింటికంటే మనకు ముఖ్యమైనది ఆరోగ్యం. ఆరోగ్యం బాగుండాలంటే మంచి పరిసరాలు, శుభ్రమైన కార్యాలయాలు, గ్రామాలు ఉండాలి. నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్రంలో 108 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది. వర్షాలకు ఆ చెత్త భూమిలో ఇంకి తద్వారా భూగర్భ జలాలు కలుషితమయ్యే పరిస్థితి వచ్చింది. నూటికి 97 శాతం మున్సిపాలి టీల్లో ఇంటింటికి వెళ్లి చెత్త సేకరిస్తున్నారు. వచ్చే నెల కల్లా రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో 100 శాతం ఇంటింటికీ చెత్త సేకరిస్తాం. రాష్ట్రంలో 4,14,004 కుటుంబాలు హోం కంపోస్టింగ్ చేస్తున్నారు. 4,19,288 టెర్రస్ గార్డెన్లు ఉన్నాయి. రాజమండ్రి, కర్నూలు, కడప, నెల్లూరులో రూ.1,254 కోట్లతో పీపీపీ విధానంలో ‘వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల’ను మార్చి 15కల్లా వినియోగంలోకి తీసుకువస్తాం’అని సీఎం చంద్రబాబు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *