పయనించే సూర్యుడు న్యూస్ : ఇస్రో గగన్‌యాన్‌లో అనేక కీలక ఘట్టాలు ఉన్నాయి. వాటిలో పారాచూట్ పరీక్ష అత్యంత ముఖ్యమైనది. అది సరిగ్గా జరిగితే.. ఓ భారీ సక్సెస్ ఖాతాలో పడినట్లే. DRDO ఈ విషయంలో.. సత్తా చాటింది. విజయవంతంగా పూర్తి చేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం. ఈ విశ్వంలో మనకు అత్యంత సేఫ్టీ ప్రదేశం ఏదంటే భూమి మాత్రమే. భూమిపై తప్ప మరెక్కడా మనకు సౌకర్యంగా ఉండదు. విశ్వం చూడటానికి బాగుంటుంది. కానీ.. ఆకాశంలో అనుక్షణం సవాళ్లే ఉంటాయి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ – ఇస్రో (ISRO).. మనుషుల్ని అంతరిక్షంలోకి పంపేందుకు గగన్‌యాన్ (Gaganyaan) ప్రాజెక్టును చేపట్టిందని మనకు తెలుసు. ఈ ప్రాజెక్టులో డ్రోగ్ పారాచూట్ ప్రయోగం కీలకమైనది. దీన్ని ఇస్రో కోసం రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) విజయవంతంగా నిర్వహించింది. ఈ పరీక్షను చండీగఢ్‌లోని టెర్మినల్ బాలిస్టిక్ రీసెర్చ్ లేబరేటరీ (TRBL)లో DRDOకి చెందిన రైల్ ట్రాక్ రాకెట్ స్లెడ్ (RTRS) కేంద్రంలో ఫిబ్రవరి 18న పూర్తి చేశారు. ఈ ప్రయోగం దేనికి? అమెరికా స్పేస్ రీసెర్చ్ సంస్థ – నాసా.. అప్పుడప్పుడూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) వ్యోమగాముల్ని పంపుతుంది. అలాగే ISS నుంచి కొంతమందిని తిరిగి భూమికి తెస్తుంది. వారిని అలా తెచ్చేందుకు ఉపయోగించే స్పేస్ షటిల్.. అంతరిక్షం నుంచి భూమికి అత్యంత వేగంగా వస్తుంది. అది భూమిపై ల్యాండ్ అయ్యాక.. రన్‌వేపై అత్యంత వేగంగా దూసుకెళ్తుంది. దాన్ని ఆపాలంటే.. వెనక నుంచి.. ఏదైనా తాడుతో బలంగా లాగాలి. అది కుదరదు కదా. అందుకే స్పేస్ షటిల్ వెనక ఓ పారాచూట్‌ని ఉంచుతారు. షటిల్ ల్యాండ్ అయ్యాక.. పారాచూట్ తెరచుకుంటుంది. అది షటిల్ వెనకవైపు తెరచుకొని.. గాలిని నింపుకొని.. షటిల్‌ని వెనక్కి లాగుతుంది. దాంతో షటిల్ వేగం తగ్గి.. త్వరగా ఆగుతుంది. గగన్‌యాన్ విషయంలోనూ ఇలాగే జరిగేలా ప్లాన్ చేశారు. అందుకే ఈ పారాచూట్ ప్రయోగాన్ని DRDO చేపట్టింది. ఈ పారాచూట్ ప్రయోగం సక్సెస్ అయ్యింది కాబట్టి.. గగన్‌యాన్‌లో భాగంగా.. స్పేస్‌లోకి వెళ్లే భారతీయ వ్యోమగాములు.. తిరిగి భూమిపైకి వచ్చేటప్పుడు.. షటిల్ ల్యాండ్ అవ్వగానే.. పారాచూట్ ఓపెన్ అవుతుంది. తద్వారా స్పేస్ షటిల్ వేగంగా ఆగగలుగుతుంది. ఈ ప్రయోగం మనం అనుకున్నంత ఈజీ కాదు. పారాచూట్ సరిగా తెరచుకోకపోతే.. దూసుకెళ్లే షటిల్‌ని ఆపడం చాలా కష్టం. దానికి చిన్న చిన్న రన్‌వేలు ఏమాత్రం సరిపోవు. అందుకే.. ఈ ప్రయోగాన్ని సక్సెస్ చెయ్యడం ద్వారా.. ఇస్రోకి ధైర్యాన్ని ఇచ్చింది DRDO. గగన్‌యాన్ డ్రోగ్ పారాచూట్‌ని విజయవంతంగా పరీక్షించినందుకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. డీఆర్‌డీఓకీ, ఇస్రోకీ, పరిశ్రమ రంగానికీ అభినందనలు తెలిపారు. ఈ పరీక్ష ఆత్మనిర్భర్ భారత్‌ని ముందుకు తీసుకెళ్లే మరో పెద్ద అడుగని ఆయన అన్నారు. ఇది పూర్తైంది కాబట్టి.. ఇప్పుడు ఇస్రో ఊపిరి పీల్చుకుంటుంది. ఓ కీలక ఘట్టం పూర్తైనట్లే. ఇంక మిగతా దశలపై ఇస్రో ఫోకస్ పెట్టవచ్చు. ఇదివరకు 1984లో రష్యా ద్వారా.. భారతీయ వ్యోమగామి రాకేష్ శర్మ.. అంతరిక్షంలోకి వెళ్లారు. ఆ తర్వాత మళ్లీ అలాంటిది జరగలేదు. ఇప్పుడు ఇండియా స్వయంగా తమ వ్యోమగాముల్ని రోదసీలోకి పంపబోతోంది. అంటే.. అంతరిక్ష రంగంలో మనం మరో ముందడుగు వేసినట్లవుతుంది. గగన్‌యాన్ ప్రాజెక్టును 2027లో చేపట్టేందుకు ఇస్రో రెడీ అవుతోంది.