పయనించే సూర్యుడు న్యూస్ : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విచ్చలవిడిగా డబ్బులు పంచింది: కేటీఆర్ తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై KTR స్పందన, BRS ప్రతిపక్షంలో గట్టి పోటీ, 17 విజయాలు, కాంగ్రెస్ డబ్బు ఖర్చు ఫలితం లేకపోవడం, BJP ప్రభావం శూన్యం, ఫార్ములా-ఈ కేసుపై రాజకీయ విమర్శలు. తెలంగాణలో ఇటీవల వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షంలో ఉండి కూడా తమ పార్టీ శ్రేణులు అద్భుత పోరాట పటిమ కనబరిచాయని, ఈ ఫలితాలు తమకు ఎంతో సంతృప్తినిచ్చాయని ఆయన పేర్కొన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసినప్పటికీ ఆశించినన్ని స్థానాలు దక్కించుకోలేక తీవ్ర అసంతృప్తితో ఉందని ఎద్దేవా చేశారు. తాము 30కి పైగా మున్సిపాలిటీలు ఆశించినప్పటికీ, 17 చోట్ల ప్రత్యక్ష విజయం సాధించామని, హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో కూడా తమకు గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు సాధారణంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయని, అయినా బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చిందని తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు స్వయంగా వచ్చి ప్రచారం చేసినా ఒక్క మున్సిపాలిటీ కూడా గెలవలేకపోయారని, ఆ పార్టీ గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పనితీరును కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆనాడు కాంగ్రెస్ కేవలం నాలుగు స్థానాలు మాత్రమే గెలుచుకుందని, రేవంత్ రెడ్డి మల్కాజిగిరి ఎంపీగా, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు జీహెచ్ఎంసీలో ఎన్ని సీట్లు గెలిచారో అందరికీ తెలుసని చురకలంటించారు. ఇప్పుడు తాము ప్రతిపక్షంలో ఉండి సాధించిన విజయాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. బీజేపీ పనితీరును ఎండగడుతూ.. గతంతో పోలిస్తే ఆ పార్టీకి ఓట్లు, వార్డులు తగ్గాయని విశ్లేషించారు. ఒక ముఖ్యమంత్రి, జాతీయ అధ్యక్షుడు వచ్చి ప్రచారం చేసినా బీజేపీ ప్రభావం శూన్యమని, స్థానిక ఎన్నికల్లో స్థానిక అంశాలే ప్రధాన పాత్ర పోషిస్తాయని, అగ్రనేతల పర్యటనలతో పెద్దగా ప్రయోజనం ఉండదని తేల్చిచెప్పారు. మున్సిపల్ చైర్మన్, మేయర్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటింగ్ నిబంధనలపై ప్రభుత్వానికే స్పష్టత లేదని కేటీఆర్ మండిపడ్డారు. నిన్నటి వరకు కలెక్టర్లు ఒకలా, చీఫ్ సెక్రటరీ మరొకలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న నిబంధనలపై గందరగోళం నెలకొందని, అధికారులు తలో మాట చెబుతున్నారని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తమపై అడ్డగోలుగా మాట్లాడిన వారికి పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో తమ కార్యకర్తలు చేసిన పోరాటమే సరైన సమాధానమని ఆయన వ్యాఖ్యానించారు.ఇక ప్రభుత్వం మరోసారి ఫార్ములా-ఈ కేసును తెరపైకి తేవడంపై కేటీఆర్ స్పందించారు. ఇది కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యేనని, తమాషా కోసమే మళ్ళీ నోటీసులు ఇస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే నాలుగుసార్లు విచారణకు పిలిచారని, ఆ కేసులో పస లేదని ఏసీబీ, పోలీసు అధికారులే స్వయంగా ముఖ్యమంత్రికి చెప్పారని గుర్తుచేశారు. అయినా ఎన్నిసార్లు పిలిచినా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని, ఉన్న సత్యాన్ని నిర్భయంగా చెబుతామని స్పష్టం చేశారు. తనను జైలులో పెట్టినా భయపడేది లేదని తేల్చిచెప్పారు.