మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస

* 50 ఇళ్లు కాల్చివేత, ఇంటర్నెట్ నిలిపివేత

పయనించే సూర్యుడు న్యూస్ :  మణిపూర్ ఉఖ్రుల్ జిల్లాలో లిటాన్ గ్రామంలో తంగ్ఖుల్ నాగా, కుకీ వర్గాల మధ్య ఘర్షణలు, 50 ఇళ్లకు నిప్పు, ఇంటర్నెట్ 5 రోజులు నిలిపివేత, ప్రజలు భయాందోళన. మణిపూర్ రాష్ట్రంలో మరోసారి హింస చెలరేగింది. ఉఖ్రుల్ జిల్లా లిటాన్ గ్రామంలో తంగ్ఖుల్ నాగా, కుకీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలు యుద్ధవాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఈ గొడవల్లో ఆందోళనకారులు రెచ్చిపోయి సుమారు 50 ఇళ్లకు నిప్పు పెట్టారు. సోమవారం రాత్రి మొదలైన ఈ విధ్వంసం మంగళవారం ఉదయానికి మరింత తీవ్రమైంది. రెండు వర్గాల మధ్య భారీగా కాల్పులు జరిగాయి. పరిస్థితి అదుపు తప్పడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి వదంతులు వ్యాపించకుండా ఉండేందుకు జిల్లావ్యాప్తంగా 5 రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేశారు. భారీ సంఖ్యలో భద్రతా బలగాలను సంఘటనా స్థలానికి తరలించారు. ఈ తాజా హింసతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. శాంతిభద్రతలను కాపాడటానికి పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. లిటాన్ సరేఖోంగ్ ప్రాంతంలో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. శనివారం లిటాన్ గ్రామంలో జరిగిన చిన్న గొడవ ఈ పెద్ద విధ్వంసానికి దారితీసింది. ఆ రోజు జరిగిన ఘర్షణలో స్టెర్లింగ్ షిమ్రే అనే వ్యక్తి గాయపడ్డాడు. దీనివల్ల రెండు వర్గాల మధ్య పగ మరింత పెరిగింది. ఆదివారం నాడు జిల్లా యంత్రాంగం నిషేధాజ్ఞలు జారీ చేసినప్పటికీ ఆందోళనకారులు వాటిని లెక్కచేయలేదు. సోమవారం అర్ధరాత్రి దాటాక దుండగులు ఇళ్లను కాల్చడం మొదలుపెట్టారు. మొదట 18 ఇళ్లు కాలిపోగా, మంగళవారం నాటికి ఆ సంఖ్య 50కి చేరినట్లు అధికారులు చెప్పారు.సోషల్ మీడియా ద్వారా తప్పుడు వార్తలు, రెచ్చగొట్టే వీడియోలు ప్రచారం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను ఆపేసింది. బ్రాడ్‌బ్యాండ్, మొబైల్ డేటా వంటి అన్ని రకాల సేవలపై 5 రోజుల పాటు నిషేధం విధించారు. జిల్లా మేజిస్ట్రేట్ ఆశిష్ దాస్ విజ్ఞప్తి మేరకు హోం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజలు శాంతి పాటించాలని, చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని పోలీసులు హెచ్చరించారు. అల్లరి మూకలను అడ్డుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రాణభయంతో లిటాన్ సరేఖోంగ్ గ్రామస్తులు ఇళ్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధులు కంగ్పోక్పి జిల్లాలోని మోత్‌బుంగ్, సైకుల్ వంటి ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. ఇటీవల రెండు నాగా సంఘాలు కుకీ ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించడం కూడా ఈ ఘర్షణలకు ఒక కారణమని తెలుస్తోంది. రాష్ట్ర మంత్రి గోవిందాస్ కోంతౌజమ్ మాట్లాడుతూ అదనపు బలగాలను పంపామని, పరిస్థితిని అదుపులోకి తెస్తున్నామని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *