పయనించే సూర్యుడు న్యూస్ : ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ పాత్ర ఎంతో కీలకమని.. రైతుల సంక్షేమానికి, రాష్ట్ర వ్యవసాయాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. దేశ వ్యవసాయ రంగంలో ఏపీ వాటా 10 శాతం ఉందని, రాష్ట్రం శరవేగంగా హార్టికల్చర్ హబ్‌గా మారుతోందని కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. రైతుల సంక్షేమానికి, రాష్ట్ర వ్యవసాయాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. నేడు ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు ముందుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అనంతరం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కీలక భేటీ జరిపారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగంతో పాటు అనుబంధ రంగాల అభివృద్ధికి కేంద్రం నుంచి మరింత సహకారం కోరుతూ పలు ప్రతిపాదనలు మంత్రి ముందు ఉంచారు. ముఖ్యంగా పీఎం-ప్రణామ్ (PM-PRANAM) పథకం కింద రాష్ట్రంలో కమ్యూనిటీ మేనేజ్డ్ ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించడానికి తగిన నిధులు కేటాయించాలని కోరారు. రాష్ట్ర రైతులు రసాయన ఎరువుల వాడకం తగ్గించినందుకు గాను ప్రోత్సాహకాలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రితో చర్చల సందర్భంగా రసాయన ఎరువుల వినియోగంపై ఆసక్తికరమైన విషయాలను చంద్రబాబు వివరించారు. 2024-25 సంవత్సరంలో రాష్ట్రంలో రసాయనాల వాడకం 2.28 శాతం మేర తగ్గిందని తెలిపారు. ఈ ఏడాదికి సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన రూ.216 కోట్లు విడుదల చేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా సేంద్రియ సాగుకు రైతుల నుంచి విశేష స్పందన లభిస్తోందని, ఇప్పటి వరకు దాదాపు 18 లక్షల మంది రైతులు 8 లక్షల హెక్టార్లలో ఈ విధానాన్ని పాటించడానికి ముందుకు వచ్చారని సీఎం పేర్కొన్నారు. కొబ్బరి రైతులను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా ఇరువురు చర్చించారు. రాష్ట్రంలో కొబ్బరి సాగు అభివృద్ధికి రూ.200 కోట్ల ఆర్థిక సాయం అందించాలని చంద్రబాబు కోరారు. కోకోనట్ ప్రాసెసింగ్ పార్క్ ఏర్పాటు, కర్ణాటక తరహాలో ఆధునిక టెండర్ కోకోనట్ మార్కెట్ల నిర్మాణం, రైతులకు శిక్షణ, నర్సరీల విస్తరణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు, కొల్లేరు సరస్సు ప్రాంతంలో దాదాపు 50 వేల ఎకరాల్లో మఖానా (తామర గింజలు) సాగుకు అనుకూల వాతావరణం ఉందని, అక్కడ మఖానా డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తులపై కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సానుకూలంగా స్పందించారు. ఏపీలో పండే జీడిపప్పు, కాఫీ, కోకో, కొబ్బరి పంటలకు కనీస మద్దతు ధర దక్కేలా చూస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యవసాయాభివృద్ధిని పర్యవేక్షించేందుకు కేంద్రం ఒక ప్రత్యేక బృందాన్ని నియమించిందని వెల్లడించారు. సాంకేతికత, కేంద్ర పథకాల విషయంలో రాష్ట్రానికి పూర్తి అండగా నిలుస్తామని, మత్స్యరంగం, పశుపోషణ అభివృద్ధికి కూడా సాయం చేస్తామని భరోసా ఇచ్చారు.