పయనించే సూర్యుడు న్యూస్ : రేవంత్ రెడ్డి భూపాలపల్లి జిల్లా పర్యటనలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం, సింగరేణి కార్మికుల హక్కులు, జిల్లాల రద్దు దుష్ప్రచారంపై స్పష్టత ఇచ్చారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తుండగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లా పర్యటనకు రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ముందుగా రేగొండ మండలం కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించిన సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనులను పరిశీలించి, రూ.12.15 కోట్ల వ్యయంతో చేపడుతున్న ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. భక్తులకు సౌకర్యంగా నిర్మించిన వసతి గృహ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఘనపురం మండలం చిల్పూర్ గ్రామ పరిధిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రత్యేక చరిత్ర ఉందని, తెలంగాణ ఉద్యమంలో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల పాత్ర కీలకమని గుర్తుచేశారు. దేశానికి నల్లబంగారం అందిస్తున్న సింగరేణి కార్మికులు ఆదర్శమని కొనియాడారు. భూపాలపల్లి అభివృద్ధి ప్రస్తావనలో మాట్లాడుతూ, ఒకప్పుడు కుగ్రామంగా ఉన్న ఈ ప్రాంతాన్ని అన్న ఎన్టీఆర్ మండల కేంద్రంగా తీర్చిదిద్దారని, సింగరేణి బొగ్గు ఉత్పత్తికి పునాది వేసిన తర్వాత భూపాలపల్లి వెనక్కి తిరిగి చూడలేదన్నారు. ఇప్పుడు జిల్లా కేంద్రంగా, మున్సిపాలిటీగా ఎదిగిందని పేర్కొన్నారు. భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని సీఎం తీవ్రంగా ఖండించారు. అలాంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అది కొందరు చేస్తున్న దుష్ప్రచారం మాత్రమేనని స్పష్టం చేశారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకున్నా చట్టబద్ధంగానే ముందుకు వెళ్తామని తెలిపారు. భూపాలపల్లి జిల్లా తొలగింపు అనే ప్రశ్నే లేదని ప్రజలు అపోహలకు లోనుకావద్దని సూచించారు. సింగరేణి కార్మికుల ప్రయోజనాలకు విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ నిర్ణయం తీసుకోదన్నారు. ప్రభుత్వంపై కావాలనే విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మెడికల్ బోర్డు అంశంపై కూడా తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని, అలాంటి వాటిని సహించబోమని హెచ్చరించారు. సింగరేణి కార్మికుల మద్దతుతోనే ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, వారి హక్కులను కాపాడటం తమ బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలపై కూడా సీఎం ఘాటు విమర్శలు చేశారు. ఫోన్ ట్యాపింగ్, ఎలక్ట్రోరల్ బాండ్ల అంశాలను ప్రస్తావిస్తూ బీఆర్ఎస్‌పై ఆరోపణలు గుప్పించారు. అవినీతి ఆరోపణలపై ప్రశ్నలు లేవనెత్తారు. కేంద్ర సంస్థల వ్యవహారశైలిపై కూడా విమర్శలు చేశారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంలో పార్టీ అభ్యర్థులకు సీఎం కీలక సూచనలు చేశారు. టికెట్ రాని వారిని నిర్లక్ష్యం చేయొద్దని, వారితో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. పార్టీ బీఫామ్ రావడం గొప్ప గుర్తింపు అని, అందరికీ అవకాశాలు వస్తాయని చెప్పారు. ఓటర్లను పలుమార్లు కలవాలని, సమస్యల పరిష్కారంపై నమ్మకం కల్పించిన వారికే ప్రజలు ఓటు వేస్తారని పేర్కొన్నారు. పట్టణాభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయడం తన బాధ్యత అని హామీ ఇచ్చారు.