సాక్షి డిజిటల్ న్యూస్ : తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని జిల్లాలను రద్దు చేస్తారనే ప్రచారం సాగుతుంది. తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని జిల్లాలను రద్దు చేస్తారనే ప్రచారం సాగుతుంది. అయితే ఆ ప్రచారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఏ జిల్లాను తొలగించడం గానీ, కొత్త జిల్లాను ఏర్పాటు చేసే ఆలోచనగానీ ప్రభుత్వ పరిశీలనలో లేదని చెప్పారు. “ప్రజా పాలన – ప్రగతి బాట” కార్యక్రమంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూరు గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా కొన్ని జిల్లాలను రద్దు చేస్తారని, సింగరేణి మెడికల్ బోర్డును రద్దు చేస్తారంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారంపై స్పష్టత ఇచ్చారు. ‘‘జయశంకర్ భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తారంటూ తప్పుడు విష ప్రచారం చేస్తున్నారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఏ జిల్లాను తొలగించడం గానీ, కొత్త జిల్లాను ఏర్పాటు చేసే ఆలోచన గానీ ప్రభుత్వ పరిశీలనలో లేదు. ఎక్కడైనా జిల్లాల్లో పునర్వ్యవస్థీకరించాలి లేదా రేషనలైజేషన్ చేయాలంటే బహిరంగంగా ప్రజలకు చెప్పి శాసనసభలో చర్చించి, ప్రతిపక్షాల సూచనలు తీసుకున్న తర్వాతనే జిల్లాల గురించి ఆలోచనలు చేస్తాం. ఎవరెన్ని కుట్రలు పన్నినా, ఎవరెన్ని అపోహలు సృష్టించినా, భూపాలపల్లి ప్రాంతం చైతన్యవంతమైన ప్రాంతం, కుట్రలు కుతంత్రాలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారో వారిని పసిగట్టగలిగే శక్తి భూపాలపల్లి ప్రజలకు ఉంది. భూపాలపల్లిని అభివృద్ధి పథంలో నడిపిస్తాం’’ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సింగరేణి మెడికల్ బోర్డుకు రద్దుకు సంబంధించి జరుగుతున్న ప్రచారాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఖండించారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు సింగరేణి పరీవాహక ప్రాంతంలో వేలాది సింగరేణి కార్మిక కుటుంబాలున్నాయని చెప్పారు. కార్పొరేట్ మెడికల్ బోర్డును రద్దు చేస్తుందని, వారసత్వ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పోతాయని కొందరు తప్పుడు, విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసలు ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చాయో అర్థం కావడం లేదని అన్నారు. సింగరేణి మెడికల్ బోర్డు రద్దు చేయాలన్న ఆలోచనే ప్రభుత్వం చేయడం లేదని చెప్పారు. కార్మికుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం పని చేస్తుంది తప్ప, కార్మికులకు నష్టం కలిగే ఏ నిర్ణయం తీసుకోదని తెలిపారు. సింగరేణి గని కార్మికులు తమ భుజాలపై మోసి ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టారని అన్నారు. 2027లో నిర్వహించబోయే పుష్కరాల గురించి మాట్లాడుతూ… ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు గోదావరి పరీవాహక ప్రాంతంలోని బాసర నుంచి భద్రాచలం వరకు ప్రతి ఆలయాన్ని పర్యాటక పుణ్యక్షేత్రాలుగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అటవీ ప్రాంతాల్లో రిసార్టులను నిర్మించి పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. గతేడాది సరస్వతి పుష్కరాలను అద్భుతంగా నిర్వహించుకున్నామని అన్నారు. అలాగే వెయ్యేండ్లు గుర్తుండే విధంగా మేడారంను తీర్చిదిద్దుకుని సమ్మక్క – సారలమ్మ జాతరను దక్షిణ కుంభమేళాగా గొప్పగా నిర్వహించామని చెప్పారు. మేడారం జాతరకు 2 కోట్ల మంది వచ్చారని అన్నారు. ఃఉమ్మడి వరంగల్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో వివిధ అభివృద్ధి పనుల కోసం రూ. 6,116 కోట్లను కేటాయించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ తొలి, మలి విడత పోరాటంలో వరంగల్ జిల్లా ప్రజలు, కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల పాత్ర, ప్రొఫెసర్ జయశంకర్ పాత్ర ఎంతో ఉందని పేర్కొన్నారు.