దేవరపల్లి ఘటనపై సీఎం ఆగ్రహం-92 మంది విద్యార్థులకు అస్వస్థత

పయనించే సూర్యుడు న్యూస్ : దేవరపల్లి బాయ్స్ హాస్టల్‌లో విద్యార్థుల అస్వస్థత ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. బాలుర వసతిగృహంలో ఏకంగా 92 మంది విద్యార్థులకు వాంతులు, కడుపునొప్పి, డయేరియా లక్షణాలు కనిపించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం కావడంతో ముఖ్యమంత్రి స్పందించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించిన సీఎం చంద్రబాబు.. అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలవరం జిల్లాలో విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. రంపచోడవరం మండలంలోని దేవరపల్లి ఆశ్రమ బాలుర వసతిగృహంలో శనివారం జరిగిన ఘటనలో మొత్తం 92 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఉదయం టిఫిన్ చేసిన తర్వాత విద్యార్థులకు వాంతులు, కడుపునొప్పి, డయేరియా లక్షణాలు కనిపించడం తీవ్ర కలకలం రేపింది. వెంటనే స్పందించిన హాస్టల్ వార్డెన్ వారిని మారేడుమిల్లి, రంపచోడవరం ఏరియా ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. అయితే ఈ ఘటనపై తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సంబంధిత అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి.. అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిన్న బ్రేక్ ఫాస్ట్ తర్వాత విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారని.. వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు సీఎంకు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మెరుగవుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాత ఆ హాస్టల్‌కు వెళ్లి అక్కడ తనిఖీలు చేపట్టి.. పరిస్థితులను అధ్యయనం చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వసతి గృహంలో ఉన్న మిగితా విద్యార్ధులకు కూడా మెడికల్ టెస్టులు చేయించి.. డయేరియా లక్షణాలు ఉన్నవారికి ట్రీట్‌మెంట్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. స్పెషల్ మెడికల్ టీమ్‌ను ఏర్పాటు చేసి హాస్టల్‌లో ఆహార పదార్ధాలతోపాటు.. నీటి నమూనాలను కూడా సేకరించి పరీక్షలు జరుపుతున్నట్లు వివరించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపేందుకు.. జాయింట్ ఇన్‌స్పెక్షన్‌ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న బాలుర ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎప్పటికప్పుడు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై తనకు నివేదిక సమర్పించాలని పేర్కొన్నారు. విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై సోమవారంలోగా పూర్తి రిపోర్టును అందించాలని పోలవరం జిల్లా కలెక్టర్‌కు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనకు కారణం అయిన వారిని వీలైనంత త్వరగా గుర్తించాలని.. వారి శాఖాపరమైన చర్యలతో పాటు.. అవసరమైతే క్రిమినల్ చర్యలు కూడా చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *