సాక్షి డిజిటల్ న్యూస్ : విద్యార్ధుల వేదన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మనసును కదిలించింది. స్కూలుకు వెళ్లేందుకు రహదారి లేకపోవడంతో విద్యార్థులు పడుతున్న కష్టాలను వీడియోలో చూసిన పవన్ కల్యాణ్ వెంటనే విద్యార్థుల సమస్యను పరిష్కరించారు. రహదారి నిర్మాణానికి రూ.86 లక్షలు శాంక్షన్ ఆర్డర్ ఇచ్చారు. దీంతో ఆ విద్యార్థులకు, గ్రామస్థులు పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ‘పవన్ సర్.. మా ఊరికి రోడ్డు వేయండి. రోడ్డు లేకపోవడం వల్ల స్కూల్‌కి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దయ చేసి రోడ్డు వేయించి మా ఇబ్బందులను తొలగించండి’అంటూ ఓ వీడియో విడుదల చేశారు విద్యార్థులు. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి వెళ్లింది. ఆ వీడియోను చూసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చలించిపోయారు. విద్యార్థుల ఆవేదన చూసి మనసు చలించిపోయింది. అంతే విద్యార్థులు అడిగిన కోరికను ఒక్క ఫోన్‌కాల్‌తో నెరవేర్చారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. విద్యార్థులు కోరిన రోడ్డు వేసేందుకు నిధులు సైతం మంజూరు చేశారు. ఇంతకీ ఆ విద్యార్థులు ఎవరు? ఏ గ్రామంలో రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నారు? అనేది తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. రూ.86 లక్షలతో రోడ్డు హామీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొండాపురం మండల పరిధిలోని గజ్జలవారిపల్లి గ్రామానికి చెందిన పాఠశాల విద్యార్ధులు రోడ్డు లేక స్కూలుకు వెళ్లేందుకు తాము పడుతున్న ఇబ్బందులు చెప్పుకుంటూ సోషల్ మీడియాలో లో పెట్టిన వీడియో సందేశం శుక్రవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చింది. ఆ జిల్లా కలెక్టర్‌తో మాట్లాడారు. అంచనాలు రూపొందించి తక్షణం రోడ్డు మంజూరు చేయాలని ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో 1.6 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ. 86 లక్షలతో అంచనాలతో శాంక్షన్ ఆర్డర్ వచ్చింది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే గజ్జలవారిపల్లె నుంచి నిత్యం స్కూళ్లకి వెళ్లే విద్యార్ధులు, పంట పొలాలకి వెళ్లే రైతుల వెతలు తీరనున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎవరు ఏది అడిగినా ఆ కోరిక నెరవేరుస్తున్నారు. ఇటీవలే అంధ క్రీడాకారులు కోరిన కోరికలను నెరవేర్చారు. వారి గ్రామానికి రోడ్డును సైతం మంజూరు చేయించారు. తాజాగా విద్యార్థులు కోరినట్లుగా రహదారి వేయించి వారి కోరిక నెరవేర్చారు. దీంతో విద్యార్థులతోపాటు గజ్జలవారిపల్లి గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.