పయనించే సూర్యుడు న్యూస్ : బాన్సువాడలో జరిగిన ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగిన ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడు కాదని, ఆయన ఎప్పటికీ బీజేపీ మనిషేనని, ప్రధాని మోదీకి ‘చోటా భాయ్’లా వ్యవహరిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలోని మైనారిటీలు, లౌకికవాదులు రేవంత్ వేసుకున్న కాంగ్రెస్ ముసుగును తొలగించి, లోపల ఉన్న అసలైన బీజేపీ నాయకుడిని గుర్తించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నామన్న అహంకారంతో ఓట్లు అడగడం కాంగ్రెస్ అవివేకమని, గత రెండేళ్లలో (2024-2026) ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం తమ స్వలాభం కోసమే పోచారం పార్టీ మారారని, దమ్ముంటే రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రావాలని, అప్పుడు ప్రజలు ఎవరి పక్షాన ఉంటారో తేలుతుందని సవాల్ విసిరారు. ప్రచారంలో భాగంగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశించి చేసిన తీవ్ర వ్యాఖ్యల ఆడియో, వీడియో క్లిప్పులను కేటీఆర్ ప్రజలకు వినిపించారు. ఆనాడు పోచారాన్ని ‘అంబోతు’ అని, ఆయన కుమారులను ‘దున్నపోతులు’ అని రేవంత్ తిట్టిన విషయాన్ని గుర్తుచేశారు. కాంట్రాక్టులు, ఇసుక దందాలతో పోచారం కుటుంబం దోచుకుంటోందని నాడు రేవంత్ చేసిన ఆరోపణలను ప్రస్తావిస్తూ.. అంతలా అవమానించిన వ్యక్తి పంచన పోచారం ఎందుకు చేరారని ప్రశ్నించారు. రేవంత్ విసిరే ఎంగిలి మెతుకుల కోసమే పోచారం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారని, బండ కట్టుకుని బావిలో దూకాలని రేవంత్ అన్న మాటలను ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తుచేశారు. తిరుమల వెంకటేశ్వర స్వామి సాక్షిగా జీవితాంతం కేసీఆర్ వెంటే ఉంటానని ప్రమాణం చేసిన పోచారం, ఇప్పుడు మాట తప్పారని కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ ఆయనను లక్ష్మీపుత్రుడిగా భావించి మంత్రిగా, స్పీకర్‌గా అత్యున్నత గౌరవం ఇస్తే.. ఆ విశ్వాసాన్ని తుంగలో తొక్కి పైసల కక్కుర్తితో పార్టీ ఫిరాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. బాన్సువాడలో గులాబీ జెండా ఎగరాలని ప్రజలు కోరుకుంటున్నారని, కేవలం డబ్బులు ఉన్నంత మాత్రాన పోచారం గొప్ప నాయకుడు కాలేరని ఎద్దేవా చేశారు. నైతిక విలువలు ఉంటే తక్షణం పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలయ్యాయో లేదో ప్రజలే ఆలోచించుకోవాలని సూచించారు. రూ. 4000 పింఛను, మహిళలకు రూ. 2500, తులం బంగారం, రైతు భరోసా, విద్యా భరోసా వంటి పథకాలు ఎవరికైతే అందాయో వారు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని, మోసపోయిన మిగతా వారంతా ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని కోరారు. మైనారిటీలకు, బీసీలకు భారీ బడ్జెట్ ఇస్తామని చెప్పి మొండిచేయి చూపారని విమర్శించారు. రానున్న రెండేళ్ల తర్వాత మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తుందని, అప్పుడు పట్టణాలను మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. గత పదేళ్లలో కేసీఆర్ సహకారంతో బాన్సువాడ నియోజకవర్గంలో సుమారు పది వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులను బీఆర్‌ఎస్ ప్రభుత్వమే చేసిందని కేటీఆర్ తెలిపారు. ఈ అభివృద్ధి అంతా ముమ్మాటికీ కేసీఆర్ ఖాతాలోకే వెళ్తుందన్నారు. కాంగ్రెస్ లో చేరిన తర్వాత బాన్సువాడకు పోచారం తెచ్చిన నిధులు, చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. కనీసం ఒక్క రూపాయి పనైనా చేశామని నిరూపించి ఓట్లు అడగాలని, లేదంటే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.