సాక్షి డిజిటల్ న్యూస్ :ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న క్వాంటం వ్యాలీ ప్రాజెక్టుకు రేపు అధికారికంగా శంకుస్థాపన జరగనుంది.అమరావతిలోని ఉద్దండరాయునిపాలెంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖా మంత్రి జితేంద్ర సింగ్‌తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూమిపూజ చేయనున్నారు. క్వాంటమ్ వ్యాలీ అనేది అత్యాధునిక క్వాంటమ్ టెక్నాలజీ అభివృద్ధికి కేంద్రబిందువుగా తయారయ్యే ఓ పరిశోధన, అభివృద్ధి హబ్. భారతదేశ భవిష్యత్ సాంకేతిక రంగాన్ని మలుపుతిప్పే చారిత్రక ఘట్టానికి అమరావతి శనివారం వేదికగా నిలవనుంది. ప్రపంచ క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో ఏపీని అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో రూపొందించిన ‘అమరావతి క్వాంటమ్ వ్యాలీ’ భవన నిర్మాణానికి శనివారం పునాదిరాయి పడుతోంది. దీని ద్వారా భారతదేశం క్వాంటమ్ విప్లవానికి నాయకత్వం వహించే అవకాశం రాష్ట్రానికి రానుంది. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖా మంత్రి జితేంద్ర సింగ్‌తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం గ్రామంలో ‘క్వాంటమ్ వ్యాలీ’ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. దీని కోసం ప్రభుత్వం 50 ఎకరాలు కేటాయించింది. మధ్యాహ్నం 2.45 గంటలకు క్యాంప్ ఆఫీస్ నుంచి ముఖ్యమంత్రి బయలుదేరి 3.00 గంటలకు ఉద్దండరాయునిపాలెం చేరుకుంటారు. సాయంత్రం 6.00 గంటల వరకు జరిగే క్వాంటమ్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని, అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. రాష్ట్రానికి, దేశానికి మైలురాయి అమరావతిలో రూపుదిద్దుకుంటున్న క్వాంటమ్ వ్యాలీ రాష్ట్రానికి, దేశానికి మైలురాయిగా నిలవనుంది. భారతదేశపు మొదటి 133 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్‌ను అమరావతికి తీసుకురావడానికి ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టి సంస్థలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్స్, క్వాంటమ్ సెన్సార్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్, హెల్త్‌కేర్, ఫైనాన్స్ వంటి కీలక రంగాల్లో పరిశోధన, ఆవిష్కరణలు, ఉత్పత్తి, నైపుణ్యాభివృద్ధికి ఇక్కడ చోటు దక్కనుంది. ప్రపంచంలోనే అత్యాధునిక క్వాంటమ్ హబ్‌ల సరసన అమరావతిని నిలపాలనే సంకల్పంతో ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు తలపెట్టారు. క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుతో ప్రపంచ స్థాయి పరిశోధన కేంద్రాలు, గ్లోబల్ టెక్నాలజీ సంస్థల పెట్టుబడులు, స్టార్టప్ ఎకోసిస్టం విస్తరణ, లక్షలాది యువతకు నైపుణ్య శిక్షణ, పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు సాధ్యం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశిస్తున్నారు. సామాన్యుడికి ఎంతో ఉపయోగం క్వాంటమ్ టెక్నాలజీతో సామాన్యుడి జీవితంలో మార్పు వస్తుంది. క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా ఫార్మా రంగంలో పరిశోధనలు వేగవంతం కావడం, వ్యాధుల నిర్ధారణ మెరుగుపడడం, వ్యవసాయంలో వాతావరణ అంచనాలు, నీటి వినియోగం, దిగుబడి అంచనాలు కచ్చితత్వంతో ఉండడం, బ్యాంకింగ్-డిజిటల్ లావాదేవీల భద్రత పెరగడం వంటి అనేక ప్రయోజనాలు సామాన్య ప్రజలకు అందనున్నాయి. ఆగస్టు నాటికి క్వాంటమ్ వ్యాలీ భవనం సిద్ధం చేసి, డిసెంబర్ కల్లా క్వాంటమ్ కంప్యూటర్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సిలికాన్ వ్యాలీ ఐటీ విప్లవానికి నాయకత్వం వహించినట్లే…, అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రపంచంలోని బోస్టన్, సింగపూర్, షాంఘై వంటి క్వాంటమ్ కేంద్రాలతో సమానంగా నిలుస్తుంది. భవిష్యత్‌లో అమరావతి క్వాంటమ్ కంప్యూటర్ల తయారీకి ప్రపంచ కేంద్రంగా మారుతుంది. క్వాంటం వ్యాలీ అంటే ఏంటి..? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అమరావతి అనేది ఒక కీలకమైన కేంద్రంగా మారనుంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి గ్లోబల్ స్థాయిలో ప్రసిద్ధి చెందేందుకు ప్రణాళికలు వేస్తోంది. అందుకు తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అమరావతిలో ఏర్పాటు చేయనున్న అమరావతి క్వాంటం వ్యాలీ భవిష్యత్తులో ఒక గేమ్ చేంజెర్ అయ్యే అవకాశం ఉందని సాంకేతిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ టెక్నాలజీ ఉపయోగించుకున్నటువంటి దేశాలు అగ్ర దేశాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. అందుకే అమరావతి క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. క్వాంటం టెక్నాలజీ అనేది భవిష్యత్తులో అన్ని రంగాల్లోనూ విస్తరించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా హార్డ్‌వేర్ తయారీ, సాఫ్ట్‌వేర్ డెవలప్ మెంట్, నైపుణ్యాల పెంపుదల, రీసెర్జ్ ఏకం చేస్తూ ఒక క్వాంటం ఎకోసిస్టమ్‌ను సృష్టించడమే ఈ క్వాంటం వ్యాలీ లక్ష్యం.