సాక్షి డిజిటల్ న్యూస్ : శత్రుదేశాలకు వెన్నులో వణుకు పుట్టించేలా భారత్.. తన ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే రష్యాతో ఎప్పటి నుంచో కొనసాగుతున్న రక్షణ ఒప్పందంలో భాగంగా కీలక నిర్ణయం వైపు అడుగులు వేస్తోంది. రష్యాకు చెందిన అత్యాధునిక సుఖోయ్ 57 ఫైటర్ జెట్లను భారత్లోనే తయారు చేసే అంశంపై రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. వీటితోపాటు మరిన్ని రక్షణ రంగ ఉత్పత్తులకు సంబంధించి కూడా భారత్, రష్యా మధ్య ఒప్పందాలు చేసుకోనున్నారు. హైదరాబాద్లో జరిగిన వింగ్స్ ఇండియా ఎయిర్ షో సందర్భంగా భారత్, రష్యా మధ్య జరిగిన రక్షణ చర్చలు జరిగాయి. రష్యాకు చెందిన ఐదో తరం అత్యాధునిక యుద్ధ విమానం సుఖోయ్ Su-57 (Su-57E)ను భారత్లో రెండు దేశాలు కలిసి సంయుక్తంగా తయారు చేసే అంశంపై ఇరు దేశాల మధ్య టెక్నికల్ చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలకు సంబంధించిన వివరాలను రష్యాకు చెందిన యునైటెడ్ ఎయిర్క్రాఫ్ట్ కార్పొరేషన్(యూఏసీ) సీఈఓ వాడిమ్ బడెఖానా తెలిపారు. ప్రస్తుతం సుఖోయ్ Su-30MKI విమానాలను తయారు చేస్తున్న భారతీయ ప్లాంట్లలోనే.. భారతీయ విడిభాగాలు, వ్యవస్థలను ఉపయోగించి సుఖోయ్ Su-57 విమానాలను లైసెన్స్డ్ ఉత్పత్తి చేసే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. అసలేంటీ Su-57 ప్రత్యేకత? రష్యా తయారు చేసిన మొట్టమొదటి ఐదో తరం యుద్ధ విమానమే ఈ Su-57. ఇవి కేవలం శత్రువుల రాడార్లకు చిక్కకుండా ఉండటమే కాకుండా.. గగనతలంలో అత్యంత వేగంగా, విన్యాసాలు చేయగల అద్భుత సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది ధ్వని వేగం కంటే 2 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించగలదు. సుమారు 1500 కిలోమీటర్ల పరిధిలో ఉన్న లక్ష్యాలను కూడా చేధించగలదు. ఈ సుఖోయ్ 57 ఫైటర్ జెట్లు.. అడ్వాన్స్డ్ రాడార్ సిస్టమ్లు, హైపర్సోనిక్ మిసైల్లను ప్రయోగించగలవు.