పొగడ్తలు అవసరం లేదన్న పవన్ కల్యాణ్

* పనికే ప్రాధాన్యం ఇస్తామన్న డిప్యూటీ సీఎం.

జనం న్యూస్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు హిత బోధ చేశారు. ‘నాకు పొగడ్తలు కాదు, పని కావాలి.నా వైపు నుంచి ఎలాంటి రాజకీయ ఒత్తిడులు, సిఫార్సులు రావు. ప్రతి అధికారి నిబంధనలకు లోబడి పనిచేయాలి’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. ‘ప్రజలు ఎన్నో ఆశలతో కూటమిని గెలిపించారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా మేమంతా పని చేస్తున్నాం. ప్రతి అడుగులో ప్రజలకు మంచి చేయాలన్న తపనతో ముందుకు వెళ్తున్నాం. ప్రభుత్వం చేయాలనుకున్న మంచిని ప్రజలకు చేరువ చేసేందుకు అధికారులు చిత్తశుద్ధితో బాధ్యతలు నిర్వర్తించాలి’ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ శాఖను ప్రభావవంతమైన శాఖగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. ప్రతి అడుగులో పాదర్శకత, జవాబుదారీతనంతో పని చేస్తున్నాం. ఇందుకు ఉద్యోగులకు కూడా అన్ని విధాలా అండగా నిలుస్తున్నామని చెప్పారు. ఉద్యోగులు కూడా అంతే చిత్తశుద్ధి, జవాబుదారీతనంతో పని చేయాలని ఆశిస్తున్నామన్నారు. అలసత్వం, అవినీతికి తావులేకుండా ప్రతి ఒక్కరు పని చేయాలని నిర్దేశం చేశారు. విశాఖ కలెక్టరేట్‌లో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, ఇంజినీరింగ్ విభాగం, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పథకం కింద పల్లెపండగ 1.0, పల్లెపండగ 2.0, అడవితల్లి బాట, జల్ జీవన్ మిషన్ తదితర విభాగాల్లో ఇప్పటి వరకు జరిగిన పనులపై ఆరా తీశారు. గత ఏడాది నిర్ధేశిత లక్ష్యాలను పూర్తి చేశారా? లేదా? పూర్తి చేయకపోతే కారణాలు ఏంటి? అనే అంశాలపై అధికారుల నుంచి వివరణ తీసుకున్నారు. ఐదేళ్ల పాలనలో ఎన్నో తప్పులు చేశారు. ‘కూటమి ప్రభుత్వం ప్రతి అడుగులో ప్రజలకు మంచి చేయాలన్న లక్ష్యంతో పని చేస్తుంది. గత ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది. పంచాయతీల్లో స్వపరిపాలనకు చోటు లేకుండా చేసింది. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా విచ్చలవిడితనంతో ఇష్టారాజ్యంగా నిధులు దారి మళ్లించింది’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరోపించారు.‘జల్ జీవన్ మిషన్ లక్ష్యాలను కూడా పూర్తిగా నిర్వీర్యం చేసింది. రూ.4 వేల కోట్లు దుర్వినియోగం అయ్యాయి. లక్ష్యాలకు విరుద్ధంగా ముక్కలు ముక్కలుగా పైపులు వేసి వదిలేసింది. పనులు చేసినట్టు రికార్డులు చూపిస్తున్నాయి గాని ఒక్క ఇంటికి కూడా నీరు ఇచ్చిన దాఖలాలు లేవు’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.‘గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ, వ్యవస్థలను బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఐదేళ్ల పాలనలో ఎన్నో తప్పులు చేశారు. సోషల్ ఆడిట్ విషయంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. గత ప్రభుత్వ హయాంలో తప్పులు చేసిన వారిపై చర్యలు కూడా లేవు’ అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మండిపడ్డారు. పొగడ్తలు కాదు పని కావాలి. ‘నాకు చప్పట్లు, పొగడ్తలు అవసరం లేదు. పని మాత్రమే కావాలి. ఉన్నత స్థాయి అధికారి నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ వరకు ప్రతి ఒక్కరు నిబద్ధతతో పని చేయాలి’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉపాధి హామీ, జల్ జీవన్ మిషన్ పనుల్లో నిర్లక్ష్యాన్ని, నిధుల దుర్వినియోగాన్ని సహించం అని హెచ్చరించారు. నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడంలో విఫలం అయినా, పని పట్ల నిర్లక్ష్యం వహించినా కఠినంగా వ్యవహరిస్తాం అని వార్నింగ్ ఇచ్చారు. సోషల్ ఆడిట్ కూడా మొక్కుబడిగా కాకుండా పక్కాగా జరగాలి. క్షేత్ర స్థాయిలో ఉన్న ప్రతి వ్యక్తికి అభివృద్ధి ఫలాలు అందాలి అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *