జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లోని నేతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నేతన్నలకు ఎన్నికల్లో ఇచ్చిన మరో కీలక హామీని నెరవేరుస్తున్నట్టుగా వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని నేతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నేతన్నలకు ఎన్నికల్లో ఇచ్చిన మరో కీలక హామీని నెరవేరుస్తున్నట్టుగా వెల్లడించింది. ఏప్రిల్ 1 నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేయనున్నామని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత గురువారం తెలిపారు. మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్లను ఉచితంగా అందజేయనున్నట్లు వెల్లడించారు. మంత్రి ఎస్ సవిత గురువారం సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆనాడూ ఎన్టీఆర్, నేడు సీఎం చంద్రబాబునాయుడు నేతన్నలకు అండగా ఉంటున్నారన్నారు. 2014-19 టీడీపీ పాలన నేతన్నలకు స్వర్ణయుగమని చెప్పారు. గత ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ ఇచ్చిన మాటకు కట్టుబడుతూ, కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చుతోందన్నారు. ఈ క్రమంలోనే నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం హామీ అమలుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఏప్రిల్ ఒకటి నుంచి ఈ పథకం అమలు చేయనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. మగ్గం కలిగిన నేతన్నలకు 200 యూనిట్లు, మరమగ్గం ఉన్న చేనేతలకు 500 యూనిట్లు ఉచితంగా అందజేయనున్నామన్నారు. మగ్గం కలిగిన 93 వేల కుటుంబాలు, మర మగ్గాలు వాడుతున్న 10,534 కుటుంబాలు మొత్తం 1,03,534 కుటుంబాలకు ఉచిత విద్యుత్ పథకంతో లబ్ధి జరగనుందని తెలిపారు. ఈ పథకం అమలుతో ప్రభుత్వంపై ఏడాదికి రూ.85 కోట్లకుపైగా భారం పడనున్నట్లు వెల్లడించారు. మగ్గం వాడే నేతన్నకు నెలకు రూ.720లు, ఏడాదికి రూ.8,640లు ఆదా కానున్నట్లు తెలిపారు. మర మగ్గం వాడేవారికి నెలకు రూ.1,800లు, ఏడాదికి రూ.21,600లు ఆర్థికంగా లబ్ధి కలుగుతున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. నేతన్నలకు ఆర్థిక భరోసా కలిగించేలా నిర్ణయాలు తీసుకుంటున్నామని మంత్రి సవిత తెలిపారు. ఇందులో భాగంగా అధికారంలోకి రాగానే 50ఏళ్లు నిండిన నేతన్నలకు రూ. 4 వేల చొప్పున పెన్షన్‌లు అందజేస్తున్నామని తెలిపారు.