జనం న్యూస్: నరకాసురుడు లాంటి వ్యక్తి మళ్లీ వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అవుతుంది అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ‘గత ఐదేళ్లలో రాక్షస పాలన వల్ల రాష్ట్రం అతలాకుతలమైంది. ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా చేశారు.నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు.’అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. నేరస్తులు రాజకీయాలు చేస్తే ఏమవుతుందో గత ఐదేళ్లూ చూశామని, మంచి-చెడుకి వ్యత్యాసం ఏంటో ప్రజలు తెలుసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. చెడ్డ వ్యక్తులను ప్రోత్సహిస్తే సమాజానికి హాని జరుగుతుందని, స్వచ్ఛమైన ఆలోచనలు ఉంటేనే భవిష్యత్ బాగుంటుందని అన్నారు. చిత్తూరు జిల్లా నగరిలో స్వర్ణాంధ్ర –స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వ్యర్ధాల సేకరణ కోసం ఉద్దేశించిన స్వచ్ఛ రథాలను ప్రారంభించారు. ప్రజా వేదిక వద్ద ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లతో పాటు మెప్మా, డ్వాక్రా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. పలువురు పారిశుద్ధ్య కార్మికుల సేవలను అభినందిస్తూ సన్మానించారు. అనంతరం ప్రజా వేదిక సభలో పాల్గొని ప్రసంగించారు. ‘నగరిలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఏడాది క్రితం ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా ప్రారంభించాం. స్వచ్ఛాంధ్ర అనేది కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు…ఇది మన జీవన విధానం కావాలి. అందుకే ప్రతి నెలా 3వ శనివారం నాతో సహా నేతలు, అధికార యంత్రాంగం హాజరవుతున్నాము. సమైక్యాంధ్రలో ముఖ్యమంత్రిగా జన్మభూమి, పచ్చదనం-పరిశుభ్రత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను. స్వచ్ఛాంధ్రలో కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలి.’అని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కింద పరిశుభ్రతా డ్రైవ్లు చేపట్టాం. ‘స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో మొత్తం రూ.573 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుపుకుంటున్నాం. స్వచ్ఛభారత్ మిషన్ అర్బన్ 2.0లో భాగంగా సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ కింద 101 ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టులను రూ.510 కోట్లతో చేపడుతున్నాం. రూ.2.21 కోట్ల విలువైన 9,048 హోం కంపోస్టింగ్ బిన్స్ హౌస్ హోల్డ్ వేస్ట్ ప్రాసెసింగ్ కోసం మెప్మా ఆర్పీలకు సమకూర్చడం జరిగింది.’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.‘గ్రామాల్లో ఇంటింటికీ చెత్త సేకరణ కోసం స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ 2.0 కింద రూ.6.7 కోట్లతో 200 e-ఆటోలు, 12,000 ట్రైసైకిళ్లు, 5,000 పుష్కార్ట్స్ సిద్ధం చేశాం. గతేడాది నుంచి స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కింద విస్తృతంగా పరిశుభ్రతా డ్రైవ్లు చేపట్టాం. లెగసీ వేస్ట్ తొలగింపులో రికార్డులు సృష్టించాం. పట్టణాల్లో ఇప్పటి వరకు 105 లక్షల మెట్రిక్ టన్నుల పాత చెత్త తొలగించాం. గ్రామీణ ప్రాంతాల్లో 7 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను క్లియర్ చేస్తున్నాం. మార్చి 2026 నాటికి లెగసీ వేస్ట్ తొలగింపులో 100 శాతం లక్ష్యం చేరుకుంటాం.’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.‘పట్టణాలో 97.26 శాతం ఇళ్ల నుంచి డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్ చేస్తుండగా, అన్ని పంచాయతీల్లో వ్యర్ధాల సేకరణ జరుగుతోంది. 62 శాతం ఇళ్లకు వెళ్లి చెత్తను సేకరిస్తున్నారు. ఈ మార్చి నాటికి పంచాయతీలు, పట్టణాల్లో 100 ఇళ్ల నుంచి డోర్ టు డోర్ కలెక్షన్ ఉంటుంది. వచ్చే నెలలో కర్నూలు, రాజమండ్రి, కడప, నెల్లూరులో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను పీపీపీ మోడల్లో చేపడుతున్నాం. రెండేళ్లలో ఇవి ఉత్పత్తి మొదలు పెడతాయి. విజయవాడ, తిరుపతికి కూడా వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ప్రతిపాదనలు ఉన్నాయి. ఇవి కార్యరూపం దాల్చితే ప్రజలకు డంపింగ్ యార్డ్ సమస్య ఉండదు. కాలుష్యం కూడా తగ్గుతుంది. సంపద తయారీ కేంద్రాలను 10,790 వరకు ఏర్పాటు చేశాం. స్వయం సహాయ సంఘాల భాగస్వామ్యంతో కంపోస్ట్ తయారవుతోంది. దాన్ని రైతులకు సరఫరా చేస్తాం. స్వచ్ఛ రథాలతో మీ ఇళ్లలోని డ్రై వేస్ట్, ప్లాస్టిక్, కాగితాలు వంటివి తీసుకుని నిత్యావసరాలు ఇస్తున్నాం. ఇప్పటివరకు 30 స్వచ్ఛరథాలు ఉన్నాయి. మరో 70 మార్చి నాటికి ప్రవేశ పెడతాం’అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఏపీ ‘ప్రజలందరి సహకారంతో ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఏపీని తయారుచేయాలని సంకల్పించాం. 2018లోనే ఓడీఎఫ్ రాష్ట్రంగా ఏపీని నిలిపాం. ఇప్పుడు ఓడీఎఫ్ ప్లస్ రాష్ట్రంగా ఈ మార్చికి తీర్చిదిద్దుతాం. రాష్ట్ర సచివాలయంతో సహా 17 పట్టణ, నగరపాలక సంస్థల కార్యాలయాలు ఇప్పుడు పూర్తిగా ప్లాస్టిక్ వినియోగాన్ని నిలిపేశాయి.’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.