పయనించే సూర్యుడు న్యూస్ : పరస్పర సహకారంతోనే తెలుగు రాష్ట్రాల అభివృద్ధి చెందుతాయి అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ మంత్రి నారా లోకేశ్‌లు అన్నారు. దావోస పర్యటనలో భేటీ అయిన ఇరువురు రాష్ట్రాల ప్రగతి ప్రణాళికలపై చర్చించుకున్నారు.ఈ సందర్భంగా మేడారం జాతరకు రావాలని మంత్రి లోకేశ్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. పరస్పర సహకారంతోనే తెలుగు రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,ఏపీ మంత్రి నారా లోకేశ్ అభిప్రాయపడ్డారు.దావోస్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా సీఎంను మంగళగిరి శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.మరోవైపు ఏపీ మంత్రి నారా లోకేశ్‌ను సీఎం సత్కరించారు. ఏపీ విద్యాశాఖలో చేపట్టిన సంస్కరణలు, ఐటీ ప్రగతి గురించి మంత్రి లోకేశ్ వివరించారు. ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం తీసుకుంటున్న చర్యలు, వస్తున్న ఫలితాలపై చర్చ సాగింది. పరస్పర సహకారంతో తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో సాగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా టాటా సంస్థ సహకారంతో తెలంగాణ రాష్ట్రంలో ఐటీఐలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశామని, స్కిల్ క్యాంపస్ లుగా తీర్చిదిద్దిన ఐటీఐలను సందర్శించాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. పరస్పర సహకారంతోనే తెలుగు రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమని సీఎం చెప్పారు. పెట్టుబడుల సాధనలో పోటీపడి దేశానికే తెలుగురాష్ట్రాలు ఆదర్శంగా నిలవనున్నాయని సీఎం రేవంత్ రెడ్డి,మంత్రి నారా లోకేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు.వనదేవతలను దర్శించుకోండి: లోకేశ్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం మరోవైపు కోట్లాది మంది భక్తులు దర్శించుకునే మేడారం సమ్మక్క-సారలమ్మ దేవస్థానాన్ని వందల కోట్ల రూపాయలతో ఆధునికీకరిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దశాబ్దాలుగా ఏ ప్రభుత్వం చూపని చొరవతో రహదారులు, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, తప్పకుండా వనదేవతలను దర్శించుకోవాలని మంత్రి లోకేశ్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.పెట్టుబడుల సాధనలో తెలుగు రాష్ట్రాలు పరస్పరం పోటీపడుతూనే, అభివృద్ధి విషయంలో సహకరించుకోవాలని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. ఈ స్ఫూర్తితో ముందుకెళితే దేశానికే తెలుగు రాష్ట్రాలు ఆదర్శంగా నిలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.