పయనించే సూర్యుడు న్యూస్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని సంచలన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రధానంగా సోషల్ మీడియాని పిల్లలకు దూరంగా ఉంచాలనే ఆలోచనకు వస్తున్నట్లు కనిపిస్తోంది. అసలు సర్కార్ ప్లాన్ ఏంటో తెలుసుకుందాం. అనగనగా ఓ రోజు.. ఓ మహిళ.. తన 4 ఏళ్ల పిల్లాడితో కలిసి బస్సులో ప్రయాణిస్తోంది. ఆ పిల్లాడు మొబైల్‌తో ఆడుకుంటున్నాడు. ఓసారి దాన్ని పడేశాడు. తోటి ప్రయాణికులు దాన్ని తీసి ఇచ్చారు. ఆమె దాన్ని మళ్లీ పిల్లాడికి ఇచ్చింది. ఆ పిల్లాడు ఆడుకుంటూ.. మళ్లీ కింద పడేశాడు. ఈసారి ఆ మొబైల్ తీసిన తోటి ప్రయాణికులు.. “పిల్లాడికి ఎందుకు మొబైల్? ఇవ్వకండి” అని చెప్పారు. దానికి ఆమె ఏమందో తెలుసా? “ఆ.. ఇంకేమైనా ఉందా.. మొబైల్ ఇవ్వకపోతే.. గోల గోల చేస్తాడు. అమ్మో” అంటూ.. మళ్లీ ఆ పిల్లాడికి మొబైల్ ఇచ్చింది. ఇది ఓ తల్లి పరిస్థితి మాత్రమే కాదు. ఇండియాలో చాలా మంది తల్లిదండ్రుల పరిస్థితి ఇలాగే తయారైంది. మొబైల్, సోషల్ మీడియాకి పిల్లలు బాగా అలవాటుపడిపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే.. బానిసల్లా మారిపోతున్నారు. ఐతే.. 16 ఏళ్ల లోపు యువతకు ఏది మంచో, ఏది చెడో సరిగ్గా తెలియదు. తాము సోషల్ మీడియాలో చూసేవన్నీ నిజమే అనుకుంటారు. అలాంటి వారు కొన్ని సందర్భాల్లో అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీని వల్ల మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతోంది. యూత్‌ని సోషల్ మీడియా చెడగొడుతోంది. ఐతే.. అందులో ఏం చూడాలి? ఏం చూడకూడదు? ఏం నేర్చుకోవాలి? ఏది నేర్చుకోకూడదు? అనేది మైనర్లు సరిగ్గా గుర్తించలేకపోతున్నారు. ఇలాంటి అంశాల్ని గమనించిన ఏపీ ప్రభుత్వం 16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియాను బ్యాన్ చెయ్యాలనే ఆలోచనలో ఉంది. స్విట్జర్లాండ్.. దావోస్ లోని బ్లూమ్స్బెర్గ్తో ఐటీ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేసే అంశాన్ని ఏపీ ప్రభుత్వం పరిశీలిస్తోంది అని చెప్పారు. ఇప్పటికే ఇలాంటి నిర్ణయాన్ని ఆస్ట్రేలియా తీసుకుంది. ఇప్పుడు దాన్ని ఏపీ ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని మంత్రి తెలిపారు. 16 ఏళ్ల లోపు యువతకు సోషల్ మీడియాలో ఏది చూడాలో, ఏది చూడకూడదో పూర్తి అవగాహన ఉండదు అన్న ఆయన.. పిల్లలు తప్పుదారి పట్టకుండా.. బలమైన చట్టపరమైన చర్యలు ఉండాలని అన్నారు. నారా లోకేష్ వ్యాఖ్యలపై టీడీపీ జాతీయ ప్రతినిధి దీపక్ రెడ్డి స్పందించారు. మంత్రి సరైన విధంగా మాట్లాడారానీ, సోషల్ మీడియా వల్ల పిల్లలకు మానసికంగా తీవ్రమైన సమస్యలు ఎదురవుతున్న విషయాన్ని మంత్రి హైలెట్ చేశారని అన్నారు. యువత సేఫ్టీ చాలా ముఖ్యమన్న ఆయన.. 16 ఏళ్ల లోపు పిల్లలకు ఎమోషనల్‌గా మెచూరిటీ ఉండదనీ.. అందువల్ల వారికి స్వేచ్ఛగా లభిస్తున్న నెగెటివ్, ప్రమాదకరమైన కంటెంట్ వల్ల సమస్యలు రాగలవు అని అన్నారు. అందుకే ఏపీ ప్రభుత్వం ప్రపంచ దేశాల్లో ఇలాంటి అంశంపై తీసుకుంటున్న చర్యల్ని పరిశీలిస్తున్నాం అనీ, ఆస్ట్రేలియా సోషల్ మీడియా చట్టాన్ని గమనిస్తున్నామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం సోషల్ మీడియాని తప్పుదారి పట్టించేలా వాడుకుందనీ.. మహిళలకు వ్యతిరేకంగా మాట్లాడేలా చాలా మందిని ప్రోత్సహించిందని దీపక్ రెడ్డి ఆరోపించారు. అలాంటి వాటిపై చర్యలు తీసుకున్న తొలి రాష్ట్రం ఏపీయేనని చెప్పిన ఆయన.. అదే విధంగా.. ఇప్పుడు పిల్లల్ని కాపాడే విషయంపైనా దృష్టి పెడుతున్నామని అన్నారు. విషపూరితమైన కంటెంట్ ఆన్లైన్ ద్వారా పిల్లలకు చేరకుండా చేస్తామన్నారు. ఈ విషయంలో నారా లోకేష్ తీసుకుంటున్న చర్యలకు తెలుగు దేశం పార్టీ పూర్తి సపోర్ట్ ఇస్తుందని తెలిపారు. అందువల్ల త్వరలోనే ఇలాంటి కొత్త చట్టం వచ్చే అవకాశాలు ఉంటాయని అనుకోవచ్చు.