జనం న్యూస్: మేడారం మహా జాతరకు 4000 ప్రత్యేక బస్సులను నడపనున్నట్టుగా తెలంగాణ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అవసరమైతే మరిన్ని బస్సులు నడిపేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. గత మేడారం జాతరకు 16.82 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీలో ప్రయాణించగా ఈసారి 20 లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర. ఈ జాతర జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు జరగనున్న సంగతి తెలిసిందే.ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహించే మేడారం మహా జాతరకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాటు చేపట్టింది. మేడారంలో ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ది పనులు కూడా దాదాపు పూర్తి అయ్యాయి. ఈ మేడారం జాతరకు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీగా తరలివస్తుంటారు.ఈ క్రమంలో మేడారం మహా జాతర -2026కు భక్తులకు తరలించడం, తిరిగి వారిని స్వస్థలాలకు చేర్చడం కోసం స్పెషల్ బస్సులను నడపాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. మేడారం జాతరకి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ సమర్థవంతంగా బస్సుల ఆపరేషన్స్ నిర్వహించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. 4000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయండి. గత మేడారం జాతరలో 3491 ఆర్టీసీ బస్సులు నడిపించగా 16.82 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారు అని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అయితే ఈసారి 20 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీలో ప్రయాణం చేస్తారనే అంచనాతో 4000 బస్సులను నడిపిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. అయితే ప్రధానంగా మేడారం వెళ్ళే రూట్లలో వరంగల్ ,హనుమకొండ , ఖమ్మం,కరీంనగర్ రూట్లలో రద్దీ ఎక్కువగా ఉండనుండడంతో రద్దీగా తగిన విధంగా బస్సులు నడపడానికి అక్కడ అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. మేడారంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్ స్టాప్‌లో క్యూలైన్‌ల వద్ద ప్రయాణికులు జిల్లాల వారిగా వెళ్ళే బస్సులు డిస్ ప్లే అయ్యేలా చూడాలని అక్కడ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ సమర్థవంతంగా పని చేయాలని ఆర్టీసీ అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.మేడారంలో సంస్కృతి సాంప్రదాయాలకు అద్దంపట్టినట్టు శాశ్వత ఆర్టీసీ సముదాయ భవనాన్ని నిర్మించేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి జరుగుతున్న అవగాహన కార్యక్రమాల్లో భాగంగా మేడారం వచ్చే భక్తులకు రోడ్డు నిబంధనలపై అవగాహన కలిగించేలా హోర్డింగులు, బస్ స్టేషన్లలో , బస్సులో టీవీ ల ద్వారా ప్రచారాలు నిర్వహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఆర్టీసీలో పెండింగ్ పనులు బస్ స్టేషన్ ల అభివృధి పనుల పురోగతి పై ఆరా తీశారు. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో రాబోయే కాలంలో పూర్తిస్థాయిలో ఈవి బస్సులు రానుండడంతో అందుకు తగిన విధంగా మౌలిక సదుపాయాలు, ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇప్పుడున్న జేబీఎస్, ఎంజీబీఎస్ మాదిరి నగరంలో మరిన్ని బస్ టెర్మినల్ రావాల్సిన అవసరముందని దానిని స్టడీ చేయాలని ఆర్టీసీకి సంబంధించిన భూ బదలాయింపు పై జిల్లా కలెక్టర్లతో మాట్లాడాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.