సాక్షి డిజిటల్ న్యూస్ : ఏఐతో తెలంగాణలో ప్రజలకు మెరుగైన పౌరసేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను వినియోగించి తెలంగాణలో పౌర సేవలను మరింత సమర్థవంతంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) ఆధ్వర్యంలో దావోస్‌లో నిర్వహించిన ‘ఇంటెలిజెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ బిల్డింగ్ కంపెటిటివ్ నెస్’ అంశంపై జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… రైతు భరోసా వంటి సబ్సిడీల ట్రాకింగ్ నుంచి మొదలుకుని ఆస్తి పన్ను వసూళ్లు, మహిళలకు అందించే సంక్షేమ పథకాల అమలు, పట్టణ మున్సిపల్ సమస్యల పరిష్కారం వరకు అనేక రంగాల్లో ఏఐ ఆధారిత పరిష్కారాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని వెల్లడించారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా తెలంగాణ వ్యవస్థలోని మేధస్సే ఒకవైపు సమస్యగా, మరోవైపు పరిష్కారంగా మారుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఏఐని సరైన దిశలో వినియోగిస్తే పాలన మరింత సమర్థవంతంగా మారుతుందని అభిప్రాయ పడ్డారు. అధునాతన ఏఐ యుగంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉండలేవని…ముందస్తు చర్యలు తీసుకోవడం, వేగంగా నిర్ణయాలు అమలు చేయడమే కీలకమని ఏఐ ప్రభావం గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌ను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా వివరించారు.2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లకు కేంద్రంగా హైదరాబాద్ ప్రస్తుతం హైదరాబాద్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లకు కేంద్రంగా మారిందని…అన్ని రంగాలకు చెందిన అగ్రశ్రేణి కంపెనీలు తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా ఉండాలంటే మేధోవంతమైన వ్యవస్థలను నిర్మించాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.ఈ సదస్సులో స్మార్ట్ ఫ్యాక్టరీలు, స్థిరమైన ఇంధన వ్యవస్థలు, ఏఐ ఆధారిత సేవలు, స్మార్ట్ సిటీల నిర్మాణంపై ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న ఉత్తమ విధానాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఈజిప్ట్ పెట్టుబడులు, విదేశీ వాణిజ్య మంత్రి హస్సన్ ఎల్కహతీబ్, ఎమరాల్డ్ ఏఐ సీఈఓ వరుణ్ శివరామ్, ప్రపంచ మేధోసంపత్తి సంస్థ (WIPO) డైరెక్టర్ జనరల్ డారెన్ టాంగ్, జర్మనీ డిజిటల్ మంత్రిత్వ శాఖ మంత్రి కార్ స్టెన్ వైల్డ్ బెర్గర్, నోకియా సీఈఓ జస్టిన్ హోటార్డ్, హిటాచి సీఈఓ తోషియాకి టోకునాగా సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో భాగస్వామ్యానికి సౌదీ సంస్థ ఆసక్తి సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక సంస్థ ‘ఎక్స్ పర్టైజ్’ స్కిల్ యూనివర్సిటీతో భాగస్వామయ్యేందుకు ఆసక్తి వ్యక్తం చూపింది. సంస్థ ప్రెసిడెంట్ , సీఈఓ మొహమ్మద్ ఆశిఫ్, దావోస్‌లో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందంతో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… విద్యా వ్యవస్థకు ఉద్యోగ అవకాశాలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించాలనే లక్ష్యంతోనే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలు, ప్రాక్టికల్ శిక్షణ అందించడమే స్కిల్ యూనివర్సిటీ ప్రధాన ఉద్దేశమని సీఎం అన్నారు. భవిష్యత్‌కు ప్రతిభా కేంద్రంగా తెలంగాణ: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు 2047 విజన్‌కు అనుగుణంగా తెలంగాణను భవిష్యత్‌కు సిద్ధమైన ప్రతిభా కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుచెప్పారు. ప్రాథమిక విద్య, ఆధునిక నైపుణ్యాలు, శిక్షణ, మెంటార్షిప్ ద్వారా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక లక్ష్యం సాధించడమే ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. భారతదేశంలో పూర్తిగా పరిశ్రమల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న తొలి విశ్వవిద్యాలయం స్కిల్ యూనివర్సిటీయేనని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీతో భాగస్వామ్యం:ఎక్స్ పర్టైజ్ సంస్థ సీఈఓ ప్రతి ఏటా సుమారు 5వేల మంది నైపుణ్య కలిగిన సిబ్బందిని నియమించుకునే అవసరం తమకు ఉందని, ఆ అవసరాలను తీర్చేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో భాగస్వామ్యం చేసుకోవాలని ఎక్స్ పర్టైజ్ సంస్థ సీఈఓ మొహమ్మద్ ఆశిఫ్ ప్రతిపాదించారు. అవసరమైన అన్ని విభాగాల్లో శిక్షణను యూనివర్సిటీ తో కలిసి ప్రారంభించాలనుకుంటున్నామని ఎక్స్ పర్టైజ్ సంస్థ సీఈఓ మొహమ్మద్ ఆశిఫ్ స్పష్టం చేశారు.మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఈ సంస్థ, పెట్రో కెమికల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎరువులు, స్టీల్, సిమెంట్, వాటర్ ట్రీట్మెంట్, విద్యుత్ ఉత్పత్తి వంటి నైపుణ్యాధారిత రంగాల్లో ప్లాంట్ నిర్వహణ సేవలను అందిస్తోంది.