పయనించే సూర్యుడు న్యూస్ : పాలేరు నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి రూ.362 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. JNTUH, ఆసుపత్రి, మార్కెట్ యార్డ్, నర్సింగ్ కళాశాల ప్రారంభించారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో ఆదివారం అభివృద్ధి పనుల జాతర జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించి ఒకే రోజు రూ.362 కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి సమక్షంలో పలు కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. పాలేరు ప్రాంత సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని సీఎం స్పష్టం చేశారు. రైతుల కోసం సాగునీటి ప్రాజెక్టులు, విద్యార్థుల కోసం విద్యాసంస్థలు, ప్రజల ఆరోగ్యం కోసం ఆసుపత్రుల నిర్మాణానికి భారీగా నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా మద్దులపల్లి, కూసుమంచి ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా తమ పాలన సాగుతుందని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. ఎన్ఎస్పీ ఆయకట్టు స్థిరీకరణకు, వరద ముప్పు నుంచి రక్షణకు అత్యంత కీలకమైన మున్నేరు-పాలేరు లింక్ కెనాల్ నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. దీనికోసం రూ.162.54 కోట్లు కేటాయించారు. అలాగే విద్యా రంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా మద్దులపల్లిలో రూ.108.60 కోట్లతో జేఎన్టీయూహెచ్ (JNTUH) ఇంజినీరింగ్ కళాశాల భవన నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో కూసుమంచిలో రూ.45.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న వంద పడకల ఏరియా ఆసుపత్రికి సైతం ఆయన పునాది రాయి వేశారు. రూ.25 కోట్లతో సకల సౌకర్యాలతో నిర్మించిన ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నూతన భవనాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కాసేపు ముఖాముఖి నిర్వహించారు. అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగావకాశాలు పొందేందుకు జపనీస్, జర్మన్ భాషలు నేర్చుకోవాలని వారికి సూచించారు. జపాన్‌లో వృద్ధుల జనాభా పెరుగుతున్నందున అక్కడ భారతీయ నర్సులకు మంచి డిమాండ్ ఉందని, ఆయా భాషల్లో శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుందని హామీ ఇచ్చారు. రోగులకు సేవ చేసేటప్పుడు కరుణ, దయ కలిగి ఉండాలని హితవు పలికారు. ఇదే సమయంలో మద్దులపల్లిలో రూ.19 కోట్లతో నిర్మించిన సమీకృత వ్యవసాయ మార్కెట్ యార్డ్‌ను కూడా జాతికి అంకితం చేశారు. ఈ వేదిక సాక్షిగా సీఎం రాబోయే మున్సిపల్ ఎన్నికలకు వర్చువల్ గా సమరశంఖం పూరించారు. కాంగ్రెస్ శ్రేణులకు ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. తన ప్రసంగంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం లేకపోయినా, 17 ఏళ్లుగా పార్టీ పట్ల తనకున్న అంకితభావం, క్రమశిక్షణ చూసే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తనకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారని గుర్తుచేసుకున్నారు. తనకంటే సీనియర్లు ఉన్నప్పటికీ అధిష్టానం తనపై నమ్మకం ఉంచిందని తెలిపారు. ఈ కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఖమ్మంలో జరుగుతున్న సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభకు ఆయన హాజరయ్యారు.