సర్పంచులకు నిధుల విడుదలపై అధికారిక ప్రకటన

పయనించే సూర్యుడు న్యూస్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఈ నిర్ణయం తీసుకోగా, ఆర్థిక శాఖ వెంటనే చర్యలు చేపట్టి నిధులను గ్రామ పంచాయతీల ఖాతాల్లోకి బదిలీ చేసింది. సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలకు శుభవార్త అందించింది. గ్రామ పంచాయతీల పరిపాలనను బలోపేతం చేయడమే లక్ష్యంగా కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రూ.277 కోట్ల నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఈ నిర్ణయం తీసుకోగా, ఆర్థిక శాఖ వెంటనే చర్యలు చేపట్టి నిధులను గ్రామ పంచాయతీల ఖాతాల్లోకి బదిలీ చేసింది. పండుగ వాతావరణంలో తీసుకున్న ఈ నిర్ణయం గ్రామాల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ నిధుల విడుదలతో గ్రామ స్థాయిలో అభివృద్ధి పనులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా నిలిచిపోకుండా కొనసాగించాలన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని పంచాయతీలకు సూచనలు అందాయి. మురుగునీటి కాల్వల మరమ్మతులు, కొత్త వీధి దీపాల ఏర్పాటు, తాగునీటి పైపులైన్ల నిర్వహణ, పారిశుద్ధ్య పనులు, గ్రామీణ రహదారుల అభివృద్ధి వంటి అవసరాలకు ఈ నిధులను ప్రాధాన్యత క్రమంలో వినియోగించాల్సి ఉంటుంది. రోజువారీగా ప్రజలు ఎదుర్కొనే సమస్యలకు వెంటనే పరిష్కారం చూపే అవకాశం ఈ నిధులతో లభించనుంది. రాష్ట్రంలో సుదీర్ఘ విరామం తర్వాత 2025 డిసెంబర్‌లో మూడు విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించగా, డిసెంబర్ 22న కొత్త సర్పంచులు, పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన నెల రోజుల్లోపే ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేయడం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు నిదర్శనంగా గ్రామీణ ప్రజలు భావిస్తున్నారు. గతంలో నిధుల కొరత కారణంగా చిన్నచిన్న పనులు కూడా ఆలస్యం కావడంతో ప్రజల్లో అసంతృప్తి నెలకొనేది. తాజా నిర్ణయంతో ఆ పరిస్థితి మారుతుందని అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వంవైపు నుంచి కూడా గ్రామ పంచాయతీలకు శుభవార్త వచ్చింది. ఇన్నాళ్లుగా పెండింగ్‌లో ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రానికి రావాల్సిన సుమారు రూ.2500 కోట్ల నిధుల్లో ఈ నెలాఖరులోపు కనీసం రూ.1000 కోట్లను విడుదల చేయనున్నట్లు సమాచారం. మిగిలిన మొత్తాన్ని వచ్చే నెలలో విడుదల చేయడానికి కూడా అంగీకారం వ్యక్తమైనట్లు తెలుస్తోంది. ఈ నిధులు అందితే గ్రామ పంచాయతీల ఆర్థిక స్థితి మరింత బలోపేతం కానుంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి వరుసగా నిధులు అందుతుండటంతో గ్రామీణాభివృద్ధికి కొత్త ఊపు వచ్చిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తీసుకున్న ఈ నిర్ణయాలు పల్లెల్లో అభివృద్ధి పండుగను తెస్తాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *