జనం న్యూస్ : కేంద్ర ప్రభుత్వం జనాభా గణనకు సిద్ధమవుతున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం వెంటనే యాక్షన్ మొదలుపెట్టింది. మేము రెడీ అని చెప్పేందుకు వీలుగా ఏపీ నుంచి అధికారులను నియమించేసింది. ఇక వారు ఆ పనిలో తలమునకలవుతారు. మరి ఈ ప్రక్రియ ఎలా సాగుతుందో చూద్దాం. అమరావతి: భారతదేశంలో దాదాపు ఒక దశాబ్దం తర్వాత నిర్వహించబోతున్న జనగణన 2027 కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జనవరి 10న జారీ చేసిన జీవో నంబర్ 5 ద్వారా రాష్ట్రంలో వివిధ స్థాయిల్లో జనగణన అధికారులను నియమించింది. భారత జనగణన చట్టం, 1948 (సెక్షన్ 4(2)) ప్రకారం ఈ నియామకాలు జరిగాయి. ఇది దేశవ్యాప్తంగా మొదటి డిజిటల్ జనగణన. కోవిడ్-19 మహమ్మారి కారణంగా 2021లో జరగాల్సిన జనగణన వాయిదా పడింది. ఆ తర్వాత ఇప్పుడు 2027లో దేశవ్యాప్తంగా జనగణన జరగబోతోంది. భారత ప్రభుత్వం ఇటీవలే జనగణన 2027ను రెండు దశల్లో నిర్వహించాలని నిర్ణయించింది. మొదటి దశలో 2026 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఇంటి జాబితా (హౌస్ లిస్టింగ్), గృహ గణన జరుగుతుంది. రెండో దశలో 2027 ఫిబ్రవరి-మార్చి నెలల్లో జనాభా లెక్కల సేకరణ (పాపులేషన్ ఎన్యూమరేషన్) పూర్తవుతుంది. ఈసారి జనగణన పూర్తిగా డిజిటల్ విధానంలో జరగనుంది. పౌరులు స్వయంగా ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకునే సౌకర్యం ఉంటుంది. జనగణన ప్రక్రియకు ఆటంకం కలిగించినవారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టంలో నిబంధనలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ జనగణనను సాఫీగా నిర్వహించేందుకు జిల్లా, ఉపవిభాగ, మండల, పట్టణ, మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిల్లో అధికారులను నియమించారు. జిల్లా కలెక్టర్‌ను ప్రధాన జనగణన అధికారిగా (Principal Census Officer), జాయింట్ కలెక్టర్‌ను అదనపు ప్రధాన జనగణన అధికారిగా నియమించారు. జిల్లా రెవెన్యూ అధికారి (DRO) జిల్లా జనగణన అధికారిగా, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, జిల్లా విద్యాశాఖ అధికారి వంటివారిని అదనపు జిల్లా జనగణన అధికారులుగా నియమించారు. ఉపవిభాగ, మండల స్థాయిలో సబ్ కలెక్టర్/రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (RDO)ను ఉపవిభాగ జనగణన అధికారిగా, తహసీల్దార్‌ను చార్జ్ జనగణన అధికారిగా, మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO)ని అదనపు చార్జ్ జనగణన అధికారిగా నియమించారు. డిప్యూటీ తహసీల్దార్ వంటి తక్కువ స్థాయి అధికారులు అసిస్టెంట్ చార్జ్ జనగణన అధికారులుగా పనిచేస్తారు. పట్టణ స్థాయిలో మున్సిపాలిటీ/నగర పంచాయతీ కమిషనర్లు.. చార్జ్ జనగణన అధికారులుగా, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు.. అసిస్టెంట్ చార్జ్ అధికారులుగా ఉంటారు. మున్సిపల్ కార్పొరేషన్లలో కమిషనర్.. ప్రధాన జనగణన అధికారిగా ఉంటారు. అదనపు కమిషనర్లు, సిటీ జనగణన అధికారులుగా, జోనల్ కమిషనర్లు.. చార్జ్ అధికారులుగా విధులు చేపడతారు. ఈ నియామకాలు రాష్ట్రవ్యాప్తంగా జనగణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడానికి దోహదపడతాయి. జనగణన ద్వారా జనాభా, వసతి, విద్య, ఉపాధి వంటి కీలక డేటా సేకరించి, అందుకు అవసరమైన ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు రూపొందిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఈ జనగణన కోసం రూ.11,718 కోట్లు కేటాయించింది. రాష్ట్రాలను జనవరి 15, 2026లోగా అధికారులను నియమించాలని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఆదేశించింది. దీనికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ త్వరగా చర్యలు తీసుకుంది. ఈ జనగణనలో పౌరుల సహకారం చాలా ముఖ్యం. ఇంటి నుంచే ఆన్లైన్లో వివరాలు అందించే అవకాశం ఉండటంతో ప్రక్రియ సులువుగా సాగనుంది. జనగణన అధికారులు ఇంటింటికీ వెళ్లి డేటా సేకరిస్తారు. ఈ ప్రక్రియలో ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే చట్టపరంగా శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. మొత్తంమీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నియామకాలతో జనగణన 2027కు బలమైన పునాది వేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, మండలాలు, పట్టణాల్లో ఈ అధికారులు తమ బాధ్యతలు పూర్తి చేస్తూ దేశవ్యాప్త జనగణనలో భాగస్వామ్యం వహిస్తారు.