రైతు హక్కులపై సీఎం ఫోకస్‌

* భూముల పట్టాలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

పయనించే సూర్యుడు న్యూస్ : పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ పూర్తిగా పారదర్శకంగా జరగాలని చంద్రబాబు స్పష్టం చేశారు. రైతుల భూమి హక్కులకు సంబంధించిన కీలకమైన పత్రాలు కావడంతో ఎక్కడా పొరపాట్లు, అవకతవకలకు అవకాశం ఉండకూడదన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాయవరం పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాసు పుస్తకాల పంపిణీలో కనిపించిన నిర్లక్ష్యంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంజూరు చేసిన సంఖ్యకు తగినంత మంది రైతులు సభకు హాజరుకాకపోవడాన్ని సీఎం సీరియస్‌గా తీసుకున్నారు. దీనికి బాధ్యత వహించాల్సింది జిల్లా కలెక్టర్‌, రెవెన్యూ శాఖ అధికారులేనని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రక్రియలో బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఇలాంటి పరిస్థితులు మళ్లీ పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ పూర్తిగా పారదర్శకంగా జరగాలని చంద్రబాబు స్పష్టం చేశారు. రైతుల భూమి హక్కులకు సంబంధించిన కీలకమైన పత్రాలు కావడంతో ఎక్కడా పొరపాట్లు, అవకతవకలకు అవకాశం ఉండకూడదన్నారు. గ్రామసభల ద్వారానే రైతులకు పాసు పుస్తకాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఇళ్ల వద్దకు లేదా కార్యాలయాలకు పిలిపించి పంపిణీ చేసే పద్ధతికి ఇకపై చోటు ఉండదని తేల్చి చెప్పారు. గ్రామసభల్లోనే రైతుల సమక్షంలో పంపిణీ జరిగితేనే విశ్వసనీయత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ నెల 11వ తేదీ వరకు గ్రామసభల ద్వారా పాసు పుస్తకాలు అందజేస్తామని సీఎం తెలిపారు. ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకుండా చూడాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు. ఎమ్మార్వోలు, ఆర్డీవోలు, ఇతర సిబ్బంది బాధ్యతగా, మనసుపెట్టి పని చేయాలని సూచించారు. వచ్చే నెలలో మరోసారి సర్వే నిర్వహించి, అవసరమైన చోట్ల సవరణలతో కొత్త పాసు పుస్తకాలు ఇస్తామని వెల్లడించారు. ఒకసారి పాసు పుస్తకాలు ప్రింట్ అయిన తర్వాత ఎలాంటి తప్పులు ఉండకూడదని, ‘జీరో మిస్టేక్స్’ లక్ష్యంగా పనిచేయాలని అధికారులను హెచ్చరించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ విధానాలపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. రైతుల భూమి పత్రాలపై అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఫొటో ఎందుకు ముద్రించారో తనకు అర్థం కాలేదన్నారు. భూమి రైతులది, హక్కు కూడా రైతులదేనని స్పష్టం చేశారు. ‘మీ భూమి – మీ హక్కు’ అనే నినాదాన్ని ఎన్నికల ప్రచారంలోనే తాము ప్రజల్లోకి తీసుకెళ్లామని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేసినట్టు వెల్లడించారు. ఇప్పుడు ఇస్తున్న పట్టాదారు పాసు పుస్తకాలు రాజముద్రతో ఉండటంతో ఎవరూ ట్యాంపరింగ్ చేయలేరని సీఎం తెలిపారు. రైతుల భూమి హక్కులను కాపాడటం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని, అందులో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టంచేశారు. అధికారులు సమన్వయంతో పనిచేసి రైతులకు పూర్తి న్యాయం చేయాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *