మోదీ నాపై అసంతృప్తిగా ఉన్నారు

* డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

పయనించే సూర్యుడు న్యూస్ : డొనాల్డ్ ట్రంప్ భారత్ రష్యా ఆయిల్ కొనుగోలుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మోదీతో సన్నిహిత మైత్రి ఉన్నా, అమెరికా భారతీయ వస్తువులపై భారీ పన్నులు విధించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ వాణిజ్య విధానాలపై, ప్రధాని నరేంద్ర మోదీతో తన సంబంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీతో తనకు ఎంతో సన్నిహిత మైత్రి ఉందని చెబుతూనే, ప్రస్తుతం ఆయన తనపై అసంతృప్తిగా ఉన్నారని ట్రంప్ వెల్లడించారు. రష్యా నుంచి భారత్ ముడి చమురును కొనుగోలు చేస్తున్న కారణంగా, భారతీయ వస్తువులపై అమెరికా భారీగా పన్నులు (టారిఫ్స్) విధించడమే ఇందుకు కారణమని ఆయన స్పష్టం చేశారు. వాషింగ్టన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ ఈ విషయాలను ప్రస్తావించారు. “మోదీ చాలా మంచి వ్యక్తి. ఆయన నన్ను ప్రసన్నం చేసుకోవాలని భావించారు. కానీ రష్యా విషయంలో నేను ఆనందంగా లేనని ఆయనకు తెలుసు. భారత్ మా దేశంతో భారీగా వాణిజ్యం చేస్తోంది. వారు రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపకపోతే, వారి వస్తువులపై మేం క్షణాల్లో పన్నులు మరింత పెంచగలం” అని ట్రంప్ హెచ్చరించారు. రష్యా ఆర్థిక వనరులను దెబ్బతీయాలన్న అమెరికా ప్రయత్నాలకు, భారత్ ఆయిల్ కొనుగోలు చేయడం వల్ల విఘాతం కలుగుతోందని ఆయన ఆరోపించారు. రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించకపోవడాన్ని నిరసిస్తూ, గత ఏడాది (2025) అమెరికా ప్రభుత్వం భారతీయ వస్తువుల దిగుమతిపై సుంకాన్ని ఏకంగా 50 శాతానికి పెంచింది. ఈ చర్య మోదీకి ఏమాత్రం నచ్చలేదని, అందుకే ఆయన తనపై కోపంగా ఉన్నారని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఈ పన్నుల పెంపు వల్ల భారత ఎగుమతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. వాణిజ్య ఒప్పందం కోసం ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నా, ఈ ఆయిల్ వివాదం వల్ల అవి ముందుకు సాగడం లేదు. ట్రంప్ వ్యాఖ్యలకు మద్దతుగా రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం కూడా ఘాటుగా స్పందించారు. తక్కువ ధరకు రష్యా ఆయిల్ కొనడం అంటే యుద్ధానికి సహకరించడమేనని ఆయన విమర్శించారు. అవసరమైతే భారత్ పై 500 శాతం పన్నులు వేసేలా చట్టం తెస్తామని హెచ్చరించారు. అయితే భారత్ మాత్రం తమ దేశ ఇంధన అవసరాలు, ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని, ఎవరి నుంచి ఆయిల్ కొనాలో తామే నిర్ణయించుకుంటామని ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తోంది. తాజా పరిణామాలతో ఇరు దేశాల వాణిజ్య సంబంధాలు మరింత క్లిష్టంగా మారే అవకాశం కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *