రెండో దశ ఇందిరమ్మ ఇళ్లు ఎప్పుడు?

*మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

సాక్షి డిజిటల్ న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం రోజున ఖమ్మం జిల్లాలోని ఏదులాపురం మున్సిపాలిటీలో పర్యటించారు. ఈ క్రమంలోనే దాదాపు రూ. 1.07 కోట్ల వ్యయంతో పలు అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. గడిచిన పదేళ్లలో పేదవాడికి ఒక ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం గత ప్రభుత్వానికి లేదని అన్నారు. ఆత్మగౌరవంతో పేదవాడు తలదాచుకునే నీడ ఇవ్వకుండా పదేళ్లూ బొమ్మలు చూపి కాలక్షేపం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదే రూ. 22,500 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్లకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. గత ప్రభుత్వంలాగా అబద్ధపు హామీలతో ప్రజలను వంచించే రకం తమ ప్రభుత్వానిది కాదని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఇప్పటికే ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో 560 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని తెలిపారు. ఏప్రిల్‌లో రెండో విడత ఇళ్లు ఇస్తామని చెప్పారు. మొత్తం ఇంకా మూడు విడతలుగా అర్హులైన ప్రతి పేదవాడికీ పక్కా ఇల్లు కట్టించి తీరుతామని చెప్పారు. ఏదులాపురం అభివృద్ధికి గడిచిన రెండేళ్లలోనే సుమారు రూ. 70 కోట్లు ఖర్చు చేశామని, మిగిలిన సమస్యలను కూడా పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లలా చూస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో హాస్టల్ విద్యార్థులకు చాలీచాలని బువ్వ పెట్టి ఇబ్బంది పెట్టారని… అయితే తమ ప్రభుత్వం మెస్ ఛార్జీలు 40 శాతం, కాస్మెటిక్ ఛార్జీలు 200 శాతం పెంచిందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం పంపిణీ ద్వారా ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు, పాత కార్డుల్లో కొత్త పేర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేశామని వివరించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని… తమ ప్రభుత్వానికి ప్రజల దీవెనలు ఎప్పుడూ ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోరారు. ఇదిలాఉంటే, మంత్రి పొంగులేటి శనివారం రోజున అసెంబ్లీలో మాట్లాడుతూ…. తెలంగాణలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించిన 52,000 ఇళ్లు లబ్ధిదారుల గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మొదటి దశలో 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేసిందని తెలిపారు. వీటిలో సుమారు మూడు లక్షల ఇళ్లు వివిధ నిర్మాణ దశలలో ఉండగా… 52,000 ఇళ్లు గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు. మొదటి దశ ఇళ్ల నిర్మాణం వచ్చే వర్షాకాలంలోపు పూర్తవుతుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి అర్హులైన పేదవారికి గృహ వసతి కల్పించడానికి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని నిరంతర ప్రక్రియగా అమలు చేస్తామని తెలిపారు. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద ప్రతి సంవత్సరం మార్చి, ఏప్రిల్ నెలల్లో ఇళ్లు మంజూరు చేయబడతాయని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *