పయనించే సూర్యుడు న్యూస్ : ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణపై నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సమీక్ష, జిల్లాల సంఖ్యను 28కి పరిమితం చేయాలని నిర్ణయం, డిసెంబర్ 31న తుది గెజిట్ విడుదల. ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో మరో కీలక దశ ఆరంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం అమరావతి సచివాలయంలో దీనిపై అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. గతంలో ప్రతిపాదించిన మదనపల్లె, పోలవరం, మార్కాపురం జిల్లాల ఏర్పాటుపై వచ్చిన అభ్యంతరాలు, స్థానిక నేతల విజ్ఞప్తులను ఈ సమావేశంలో కూలంకషంగా చర్చించారు. తాజా ప్రతిపాదనల ప్రకారం రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను 29కి బదులుగా 28కి పరిమితం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పరిపాలనా సౌలభ్యం కోసం రాజంపేటను కడపలో, రాయచోటిని మదనపల్లెలో విలీనం చేయడంపై ప్రధానంగా చర్చ జరిగింది. అలాగే గూడూరును నెల్లూరులో కలపడం వంటి అంశాలను పరిశీలించారు. ఆదివారం మరోసారి దీనిపై చర్చించి, క్యాబినెట్ ఆమోదం అనంతరం డిసెంబర్ 31 నాటికి తుది గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, పారదర్శకంగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, నారాయణ పాల్గొన్నారు. ప్రధానంగా డొనకొండ, కురిచేడు మండలాలను మార్కాపురం డివిజన్ పరిధిలోకి తీసుకురావడం, పొదిలిని ప్రకాశం జిల్లాలోనే కొనసాగించడంపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. అలాగే రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో కలపాలనే ప్రతిపాదనపైనా చర్చ జరిగింది. మంత్రివర్గ ఉపసంఘం క్షేత్రస్థాయిలో సేకరించిన అభిప్రాయాల ఆధారంగానే సరిహద్దులను నిర్ణయిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విభజన వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తాజా మార్పులతో ఊరట లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం 2022లో పార్లమెంటు నియోజకవర్గాలను ప్రాతిపదికగా తీసుకుని రాష్ట్రాన్ని 26 జిల్లాలుగా విభజించింది. అయితే ఆ విభజన అస్తవ్యస్తంగా ఉందని, ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా జరిగిందని టీడీపీ కూటమి ఎన్నికల్లో విమర్శించింది. ఇచ్చిన హామీ మేరకు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2025 జులైలో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, పోలవరం ముంపు ప్రాంతాల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ మార్పులు చేస్తున్నారు. ముఖ్యంగా పోలవరం జిల్లా ఏర్పాటు ద్వారా గిరిజన ప్రాంతాల పాలనను మరింత దగ్గర చేయనున్నారు. నవంబర్ 25న ప్రభుత్వం మదనపల్లె, మార్కాపురం, పోలవరం (రంపచోడవరం కేంద్రంగా) జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. అయితే అన్నమయ్య జిల్లా కేంద్రం విషయంలో మదనపల్లె ప్రజల నుంచి వచ్చిన బలమైన డిమాండ్లను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. ఇప్పుడు చేస్తున్న మార్పులతో రాష్ట్ర పరిపాలన మరింత సమర్థవంతంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనకు కూడా ఈ కొత్త జిల్లాల కూర్పు అనుకూలంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.