క్వాంటం వ్యాలీ అమరావతి విజన్!

* అమరావతిపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన క్వాంటం వ్యాలీగా అభివృద్ధి

పయనించే సూర్యుడు న్యూస్ : సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిని ప్రపంచస్థాయి క్వాంటం వ్యాలీగా అభివృద్ధి చేస్తామని అన్నారు. IBM, TCS, ఎల్ అండ్ టీ మద్దతుతో 2026లో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ప్రారంభమవుతుందని ప్రకటించారు. అమరావతిని ప్రపంచస్థాయి ‘క్వాంటం వ్యాలీ’గా మారుస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. క్విబిట్, వైజర్ సంస్థలతో కలిసి నిర్వహించిన ‘క్వాంటం టాక్’ కార్యక్రమంలో ఆయన ఆన్‌లైన్ ద్వారా వేలాది మంది విద్యార్థులతో మాట్లాడారు. అమరావతి క్వాంటం వ్యాలీలో పరిశోధనలు చేసి నోబెల్ బహుమతి సాధించే వారికి రూ.100 కోట్ల భారీ బహుమతి ఇస్తామని చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. సిలికాన్ వ్యాలీ తరహాలో ఇక్కడ డీప్ టెక్ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేస్తామని, తద్వారా వేలాది విలువైన ఉద్యోగాలు వస్తాయని హామీ ఇచ్చారు. అమరావతి నాలెడ్జ్ ఎకానమీకి కేంద్ర బిందువుగా మారుతుందని తెలిపారు. దిగ్గజ సంస్థల మద్దతు – జనవరిలో ప్రారంభం టెక్నాలజీ సంస్థలు ప్రారంభించాలంటే అమరావతికి రావాల్సిందేనని సీఎం అన్నారు. క్వాంటం కంప్యూటర్ల తయారీకి అవసరమైన 80 నుండి 85 శాతం విడిభాగాల భాగస్వాములు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ వంటి ప్రముఖ సంస్థలు అండగా నిలుస్తున్నాయి. 2026 జనవరి నాటికి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ప్రారంభం కానుంది. ఇందుకోసం దేశంలోనే తొలిసారిగా 40 కోట్ల రూపాయలతో క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని ఏర్పాటు చేశారు. ప్రాంతాల వారీగా ప్రత్యేక హబ్‌లు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను ప్రత్యేక హబ్‌లుగా అభివృద్ధి చేస్తున్నట్లు చంద్రబాబు వివరించారు. తిరుపతిని స్పేస్ సిటీగా, విశాఖపట్నంను డేటా సెంటర్ల గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. అనంతపురం, కడప జిల్లాలను ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ కేంద్రాలుగా మారుస్తామని ప్రకటించారు. 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత భారత్ ఎలా వేగంగా అభివృద్ధి చెందిందో, ఇప్పుడు క్వాంటం టెక్నాలజీలోనూ అదే స్థాయిలో దూసుకెళ్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలని కోరారు. అమరావతి వేదికగా జరిగే పరిశోధనలు భవిష్యత్తులో సాంకేతిక రంగాన్ని శాసిస్తాయని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పూర్తి స్థాయి సరఫరా గొలుసు ఏర్పాటు చేసి, యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. జ్ఞాన ఆర్థిక వ్యవస్థకు అమరావతిని చిరునామాగా మారుస్తామని ఆయన పునరుద్ఘాటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *