జనం న్యూస్: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 29 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా సమాచారం. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 29 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి సోమవారం రోజున కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పంచాయితీ ఎన్నికల ఫలితాలపై చర్చించడంతో పాటు కృష్ణా, గోదావరి జలాలపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఆరోపణలపై చర్చించారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అసెంబ్లీ వేదికగా కృష్ణా, గోదావరి నీటి కేటాయింపులు, పాలమూరు- రంగారెడ్డి సహా పెండింగ్ ప్రాజెక్టులపై సమగ్ర చర్చ జరపాలని ప్రభుత్వం భావిస్తుంది. డిసెంబర్ 29న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా, సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కృష్ణా, గోదావరి నదీ జలాల పంపకంలో రాష్ట్ర ప్రయోజనాలను ఏ విధంగా దెబ్బతీసిందని ఇందుకు సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక చర్చ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంతర్రాష్ట్ర నదీ జలాల్లో తెలంగాణ వాటాను కాపాడటంలో విఫలమైందని రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశంలో అభిప్రాయ పడినట్టుగా తెలుస్తోంది. అలాగే నదీ జలాలకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో కంటే పదేళ్ల కేసీఆర్ పాలనలోనే తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాజకీయ మనుగడ కోసం బీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకోవాలని కేసీఆర్ చూస్తున్నారని ఆరోపించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కృష్ణా నదిపై ఒక్క ప్రధాన ప్రాజెక్టును కూడా పూర్తి చేయడంలో విఫలమైందని గోదావరిపై రూ. లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పకూలిందని అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఇందుకు సంబంధించిన వాస్తవాలను ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచేందుకు మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సిద్దంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. గ్రామ పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుగల అభ్యర్థులు అధిక స్థానాల్లో విజయం సాధించడంపై సీఎం రేవంత్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే పార్టీలో మరింత ఐక్యత అవసరమని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పార్టీల ప్రాతిపాదికన జరగబోతున్నాయని ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం నాయకులు, కార్యకర్తలు కలిసికట్టగా పనిచేయాలని కోరారు. అన్ని జిల్లా పరిషత్‌లను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.