SIR అంశంపై సీఈసీ సంచలన కామెంట్స్

* తెలంగాణలో ఏం జరగబోతోంది?

జనం న్యూస్: తెలంగాణలో కూడా త్వరలోనే సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (S.I.R – ఎస్ఐఆర్) చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్దమవుతుంది. తెలంగాణలో కూడా త్వరలోనే సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (S.I.R – ఎస్ఐఆర్) చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్దమవుతుంది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. జ్ఞానేష్ కుమార్ ఆదివారం రోజున హైదరాబాద్ రవీంద్ర భారతిలో రాష్ట్రంలోని బూత్‌ స్థాయి అధికారులు(బీఎల్‌వోలు), ఎన్నికల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ ‘‘మీరు (బీఎల్‌వోలు) భారతదేశ ఎన్నికల వ్యవస్థకు వెన్నెముక. ఓటర్ల జాబితా ప్రక్షాళన విజయం మీ శ్రద్ధ,నిజాయితీపై ఆధారపడి ఉంటుంది’’ అని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలో జరిగే ఎన్నికలకు ప్రపంచ సమాజం నిశితంగా గమనిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియను నిర్వహించే భారత ఎన్నికల సంఘానికి మీరే కీలక సైనికులని ప్రశంసించారు. బీహార్‌లో బీఎల్‌ఓలు ఎస్‌ఐఆర్‌ను విజయవంతం చేసి, దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు మార్గం చూపారని చెప్పారు. ప్రస్తుతం ఎస్ఐఆర్ ప్రక్రియ మరో 12 రాష్ట్రాల్లో కొనసాగుతోందని తెలిపారు. మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఎస్‌ఐఆర్ తదుపరి దశను త్వరలో చేపడతామని ఆయన చెప్పారు. మూడో విడతలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ చేపట్టే రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంటుందని తెలిపారు. అయితే మూడో విడత ఎస్ఐఆర్ ఎప్పుడూ చేపడతారనేది మాత్రం జ్ఞానేష్ కుమార్ వెల్లడించలేదు. ఇక, రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు దానిని విజయవంతం చేయాలని తెలంగాణలోని బీఎల్‌వోలను ఆయన కోరారు. ఎస్‌ఐఆర్ కింద స్వచ్ఛమైన, పారదర్శకమైన ఓటర్ల జాబితాలను రూపొందించాలని సూచించారు. తెలంగాణలో ఒక బీఎల్‌వో పరిధిలో 930 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. ఎస్‌ఐఆర్‌ సమయంలో ఓటర్ల జాబితాల్లోని చనిపోయినవారి పేర్లు, డబుల్‌ ఓట్లు వంటి లోపాలు బయటపడతాయన్నారు. వాటిని సరిచేయడానికి ఎస్‌ఐఆర్‌ అవసరమని చెప్పారు. జనాభా పరంగా కెనడా కంటే పెద్దదైన తెలంగాణలో, ఓటర్ల జాబితా ప్రక్షాళన కార్యక్రమం పూర్తయిన తర్వాత ఎన్నికల పరిపాలనలో కొత్త శకం ప్రారంభమవుతుందని తెలిపారు. SIR అంటే ఏమిటి? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) అనేది ఓటర్ల జాబితాలను సరిచేయడానికి పెద్ద ఎత్తున చేపట్టే కార్యక్రమం. ఓటర్ల జాబితాను సరిచేయడానికి సాధారణ వార్షిక సవరణ సరిపోదని కేంద్ర ఎన్నికల సంఘం భావించినప్పుడు. ఎస్ఐఆర్ చేపడుతుంది. అంటే పెద్ద ఎత్తున ఓటరు జాబితా ధ్రువీకరణ చేస్తుంది. ఇందులో భాగంగా బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లడం. పాత ఓటరు డేటాను పరిశీలించి ధ్రువీకరించడం ఉంటాయి. అలాగే అక్రమ ఓట్లను, నకిలీ ఓట్లను, ఒకే వ్యక్తి పేరు పలుచోట్ల ఉన్న ఓట్లను తొలగించడం వంటివి ఉంటాయి. అలాగే.. ఓటర్ల స్పెల్లింగ్, చిరునామా ఖచ్చితత్వం, ఫోటోగ్రాఫ్ స్పష్టంగా ఉందో లేదో తనిఖీ చేస్తారు. అవసరమైతే ఓటర్ పాత ఫొటో స్థానంలో తాజా ఫొటోను భర్తీ చేయనున్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324… ఓటర్ల జాబితాలను పర్యవేక్షించడానికి, అప్‌డేట్ చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘానికి సంపూర్ణ అధికారాలను మంజూరు చేస్తుంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1950లోని సెక్షన్ 21 కూడా, ఇప్పటికే ఉన్న ఓటర్ల జాబితాలలో తప్పులను గుర్తించినప్పుడల్లా ఇంటెన్సివ్ సవరణకు ఆదేశించడానికి కమిషన్‌ను అనుమతిస్తుంది. ఎస్ఐఆర్ ద్వారా చనిపోయిన లేదా వేరే చోటికి మారిన ఓటర్లను తొలగించకపోవడం వంటి సమస్యలను పరిష్కరించనున్నారు. అలాగే ఒకే వ్యక్తి పేరు వివిధ ప్రాంతాల్లో నకిలీ ఓట్లు ఉంటే వాటిని తొలగించనున్నారు. ఓటరు జాబితాల నాణ్యతను పెంచడం. నకిలీ/అక్రమ ఓటర్లను గుర్తించి తొలగించడం ఎస్ఐఆర్ ముఖ్య ఉద్దేశం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *