తెలంగాణలో తొలి లిథియం రిఫైనరీ ఏర్పాటు

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. సింగరేణి, ఆల్ట్‌మిన్ సంస్థలు కలిసి దేశంలోనే తొలి లిథియం రిఫైనరీని ఏర్పాటు చేయనున్నాయి. రూ. 2,250 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్, భారతదేశ ఇంధన భద్రతకు, స్వచ్ఛ ఇంధన పరివర్తనకు ఊతమివ్వనుంది. ఇది తెలంగాణను బ్యాటరీ తయారీకి కీలక కేంద్రంగా మార్చనుంది. తెలంగాణలో రూ. 2,250 కోట్లతో భారీ లిథియం రిఫైనరీ, ఎలక్ట్రిక్ వాహనాలకు బ్యాటరీ పవర్ , 2027 నాటికి దేశంలోనే మొదటి లిథియం ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలు, ఇంధన నిల్వ వ్యవస్థలు, స్వచ్ఛ ఇంధన పరివర్తన రంగంలో కీలక ముందడుగు పడింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్.. హైదరాబాద్‌కు చెందిన బ్యాటరీ మెటీరియల్స్, సెల్ ఇంజనీరింగ్ సంస్థ ఆల్ట్‌మిన్ ప్రైవేట్ లిమిటెడ్‌తో జతకట్టింది. దేశంలోనే మొట్టమొదటి పెద్ద ఎత్తున, బ్యాటరీ గ్రేడ్ లిథియం రిఫైనరీని తెలంగాణలో స్థాపించడానికి ఈ రెండు సంస్థలు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం రూ. 2,250 కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో ఈ కీలక ఒప్పందంపై సంతకాలు జరిగాయి. విదేశాలలో ఉన్న ఖనిజ వనరుల ద్వారా దీర్ఘకాలికంగా ముడి పదార్థాల సరఫరాను ఈ రిఫైనరీ సురక్షితం చేయనుంది. దీని ద్వారా శుద్ధి చేసిన లిథియం కోసం భారతదేశం విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. సెల్ తయారీ, ముడి పదార్థాలు, స్వచ్ఛమైన మొబిలిటీ సాంకేతికతలలో అనుబంధ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఈ రిఫైనరీ వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు, అత్యున్నత సాంకేతిక సామర్థ్యాలను సృష్టించనుంది. దేశంలో న్యూ ఎనర్జీ, అడ్వాన్స్‌డ్ మాన్యుఫాశ్చరింగ్, వ్యూహాత్మక పరిశ్రమలకు కీలక కేంద్రంగా ఎదగాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులను వేగవంతం చేయడంతో పాటు, మౌలిక సదుపాయాల సహాయం, పర్యావరణ సమన్వయాన్ని అందిస్తుంది. ఈ ఒప్పందం రాష్ట్ర పారిశ్రామికీకరణ చరిత్రలో ఒక ముఖ్య ఘట్టంగా నిలవనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *