పయనించే సూర్యుడు న్యూస్ : రుషికొండ బీచ్‌కి బ్లూఫ్లాగ్ గుర్తింపు మళ్లీ లభించింది. కందుల దుర్గేష్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఆధునిక సౌకర్యాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి కొనసాగుతోంది. రాష్ట్రంలో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన ఏకైక బీచ్‌గా రుషికొండ మరోసారి వార్తల్లో నిలుస్తోంది. ఆధునిక హంగులు, ఆకర్షణీయ రంగులు, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ బీచ్‌ను మరింత మెరుగు పరచడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటికే ‘బ్లూఫ్లాగ్’ గుర్తింపుతో ప్రపంచ పర్యాటకుల దృష్టిని ఆకర్షించిన రుషికొండను సరికొత్త అనుభూతుల కేంద్రంగా మార్చేందుకు అధికార యంత్రాంగం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గురువారం రుషికొండ బీచ్‌ను సందర్శించి పరిస్థితిని కళ్లారా పరిశీలించారు. మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోందని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు పొందేలా, విదేశీ పర్యాటకులు సైతం క్యూ కట్టేలా రుషికొండను అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు. ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్’ అనే డానిష్ సంస్థ వరుసగా మూడేళ్లు బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ ఇచ్చిన రుషికొండ ఇప్పటికే గుర్తింపు పొందింది. అయితే, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కొంతకాలం నిర్వహణ లోపాలపై ఫిర్యాదులు రావడంతో ఈ గుర్తింపు తాత్కాలికంగా దూరమైంది. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి, మళ్లీ కఠిన ప్రమాణాలు పూర్తి చేసి బ్లూఫ్లాగ్ గుర్తింపును తిరిగి సాధించింది. తీర వాతావరణం, నీటి నాణ్యత, భద్రత, పర్యావరణ పరిరక్షణ వంటి 33 కఠిన ప్రమాణాలను విజయవంతంగా దాటుకుని ఈ బీచ్ మళ్లీ ప్రపంచ స్థాయి గుర్తింపును అందుకుంది. ఇప్పుడు ఆ స్థాయిని మరింత పెంచే దిశగా పర్యాటక శాఖ అడుగులు వేస్తోంది. ఇప్పటికే బీచ్‌లో సౌర విద్యుత్, బయో టాయిలెట్స్, షవర్లు, తాగునీటి ఆర్వో ప్లాంట్, ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం, గ్రే వాటర్ ట్రీట్మెంట్, పర్యాటకుల విశ్రాంతి కోసం బెంచీలు వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు మరో అరడజను కొత్త సౌకర్యాలు తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు. సాగరతీరంలో ఆడుకుంటూ సేదతీరేలా పర్యాటకుల కోసం ఫుట్‌బాల్, క్రికెట్‌తో పాటు అంతర్జాతీయ ప్రమాణాల బీచ్ వాలీబాల్ కోర్ట్‌ను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఆరు నెలల్లోగా ఈ కొత్త సౌకర్యాలన్నీ అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. బ్లూఫ్లాగ్ ప్రమాణాలకు భంగం కలగకుండా, కాలుష్యరహిత పరిసరాలతో, భద్రతకు పూర్తి ప్రాధాన్యత ఇస్తూ రుషికొండను ‘ఇంటర్నేషనల్ టూరిజం హబ్’గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.