రెండేళ్లలో ఒక గంట కూడా సెలవు తీసుకోలేదు

*ఎర్రబస్సే కాదు,ఎయిర్ బస్సును ఆదిలాబాద్‌కు తెస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

సాక్షి డిజిటల్ న్యూస్: రెండేళ్ల ప్రజాపాలనపై తెలంగాణ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండేళ్లలో గంట కూడా తాను సెలవు తీసుకోలేదు అని చెప్పుకొచ్చారు. ‘ప్రజలకు మంచి చేయాలని నిరంతరం పనిచేస్తున్నా… అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా పనిచేస్తాం. బీజేపీ నాయకులను అయినా కలుపుకొని వెళ్తాం’అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ‘ఎర్రబస్సే కాదు..ఎయిర్ బస్సును ఆదిలాబాద్‌కు తెస్తాం. ఆదిలాబాద్ అభివృద్ధి బాధ్యత నేనే తీసుకుంటా.ఇంద్రవెల్లిని పర్యాటకకేంద్రంగా మారుస్తాం’ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆదిలాబాద్‌కు ఎర్రబస్సే కాదు ఎయిర్ బస్సును కూడా తీసుకువస్తాం అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలోని వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇఛ్చారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పలు కీలక హామీలను ఇచ్చారు. అభివృద్ధి చెందిన జిల్లాగా తెలంగాణలో అగ్రస్థానంలో నిలబెట్టే విధంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు కార్యక్రమాల్లో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడుతూ…ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు, చనాక – కొరాట ప్రాజెక్టు, విమానాశ్రయం, విశ్వవిద్యాలయం ఏర్పాటు, సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం వంటి కీలకమైన ప్రాజెక్టులపై స్పష్టమైన ప్రకటన చేశారు. ప్రాణహిత చేవెళ్ల ద్వారా నీళ్లు తుమ్మిడిహట్టి వద్ద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టి ఈ జిల్లా పంట పొలాలకు నీళ్లిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. త్వరలోనే ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి ఆదిలాబాద్ జిల్లాకు విశ్వవిద్యాలయం మంజూరు చేస్తామని ప్రకటించారు. జిల్లాకు విశ్వవిద్యాలయం మంజూరు చేస్తామని…దాన్ని ఎక్కడ పెట్టాలన్నది స్థలం ఎంపికను ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఆ వర్సిటీని ఇంద్రవెల్లిలో పెట్టడమే కాకుండా దానికి కొమురం భీం విశ్వవిద్యాలయంగా నామకరణం చేస్తే మరింత బాగుంటుందని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *