పయనించే సూర్యుడు న్యూస్ : పాల్వంచలో డా.మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నెహ్రూ విద్యా విధానంతో దేశాన్ని పునర్నిర్మించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కీలక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. దేశంలోనే మొట్టమొదటి డా. మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి ఆయన ఈ రోజు శంకుస్థాపన చేశారు. 300 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే ఈ విశ్వవిద్యాలయానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెట్టడం గొప్ప గౌరవం అని సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. ఖమ్మం జిల్లాను కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా పేర్కొన్న సీఎం, గత ఎన్నికల్లో ప్రజల సంపూర్ణ ఆశీర్వాదంతో ప్రభుత్వం ఏర్పడిందని అందుకే ఈ అభివృద్ధి కార్యక్రమం ఇక్కడి నుంచే మొదలుపెట్టామని స్పష్టం చేశారు. ఈ యూనివర్సిటీ స్థాపనతో ఖమ్మం జిల్లా విద్యా, పరిశోధన రంగాల్లో కొత్త శకానికి నాంది పలకనుంది. సింగరేణి అభివృద్ధికి ఈ ఎర్త్ యూనివర్సిటీ అవసరం చాలా ఉందని సీఎం ధ్వనించారు. భద్రాద్రి రామయ్య సాక్షిగా అభివృద్ధి హామీ భద్రాద్రి రామయ్య సాక్షిగా ఖమ్మం జిల్లా అభివృద్ధి బాధ్యత తనదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రతి ప్రభుత్వ కార్యక్రమం ఈ జిల్లా నుంచే ప్రారంభిస్తున్నామని స్పష్టం చేశారు. కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ చీరల పంపిణీ – వంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఖమ్మం జిల్లా నుంచే మొదలవుతాయని ఆయన ప్రకటించారు. యూనివర్సిటీ ఆవశ్యకత ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ముఖ్యంగా భూమికి సంబంధించిన అంశాలపై ఉన్నత విద్య పరిశోధనలను ప్రోత్సహిస్తుంది. ఈ యూనివర్సిటీ స్థాపనతో మైనింగ్, జియాలజీ, వాతావరణ శాస్త్రం, పర్యావరణ ఇంజనీరింగ్, జలవనరుల నిర్వహణ వంటి కీలక రంగాలకు సంబంధించిన నిపుణులు రాష్ట్రంలోనే తయారవుతారు. భద్రాద్రి కొత్తగూడెం సింగరేణి బొగ్గు గనులకు కేంద్రంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ విశ్వవిద్యాలయం స్థానిక యువతకు సింగరేణి, ఇతర అనుబంధ పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు కల్పించడంలో కీలకంగా మారనుంది. ఈ ప్రాంతానికి సంబంధించిన భూ వనరులు, పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడంలో కూడా పరిశోధనలు ఉపయోగపడతాయి.