సాక్షి డిజిటల్ న్యూస్: బిహార్లో ఎన్డీయే ఘన విజయం సాధించడంతో నితీష్ కుమార్ పదోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే, దాదాపు 20 ఏళ్లుగా తన వద్దే ఉన్న హోం శాఖను బీజేపీకి అప్పగించడం చర్చనీయాంశమైంది. కీలక శాఖలన్నీ బీజేపీ ఖాతాలో చేరడంతో, ఈసారి కాషాయ పార్టీని ‘పెద్దన్న’గా నితీష్ అంగీకరించినట్లు కనిపిస్తోంది. ఈ పరిణామం బిహార్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. కేవలం హెం మాత్రమే కాదు అనేక కీలక శాఖలు బీజేపీకి వెళ్లాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ నాయకత్వంలోని ఎన్డీయే అఖండ విజయాన్ని అందుకుంది. దీంతో వరుసగా పదోసారి బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ ప్రమాణం చేశారు. ఆయనతో పాటు 25 మంది క్యాబినెట్ మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయగా.. తాజాగా శుక్రవారం వారికి శాఖలను కేటాయించారు. ఈ ఎన్నికల్లో జేడీయూ 85 సీట్లు గెలిచి బీజేపీ (89) కంటే కేవలం నాలుగు సీట్లే వెనకబడింది. నితీష్ ముఖ్యమంత్రి కుర్చీపై తన పట్టును నిలుపుకున్నారు, కానీ ఆనందం ఆయనకు పూర్తిగా దక్కలేదు. దాదాపు రెండు దశాబ్దాల పాటు తనవద్దే ఉన్న హోం శాఖను బీజేపీ నేత, డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరికి అప్పగించారు. దేశంలో అత్యధికాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నితీష్ నిలిచారు. మరో డిప్యూటీ సీఎం విజయ్ సిన్హాకు రెవెన్యు, భూగర్భ శాఖలను కేటాయించారు. అలాగే, అత్యంత కీలకమైన వ్యవసాయ (రామ్ క్రిపాల్ యాదవ్), వెనుకబడి వర్గాల సంక్షేమ(రామ్ నిషాద్), విపత్తుల నిర్వహణ (నారాయణ్ ప్రసాద్), పరిశ్రమలు (దిలీప్ జైశ్వాల్), కార్మిక (సంజయ్ సింగ్ టైగర్) శాఖలు బీజేపీకే దక్కడం విశేషం. బిహార్ బీజేపీ మాజీ అధ్యక్షుడు మంగళ్ పాండేకు ఆరోగ్య, న్యాయశాఖలు వరించాయి. రోడ్లు భవనాలు (నితిన్ నబీన్), ఎస్సీ ఎస్టీ సంక్షేమ (లఖేంద్ర రౌషన్), టూరిజం (అరుణ్ శంకర్ ప్రసాద్, ఐటీ అండ్ క్రీడలు (శ్రేయాసి సింగ్), మత్స్య, పశు సంవర్దక (సురేంద్ర మెహతా), పర్యావరణ (ప్రమోద్ కుమార్) శాఖలు కూడా బీజేపీ ఖాతాలోనే చేరాయి.