సాక్షి డిజిటల్ న్యూస్: ఏఐ వలన భవిష్యత్తులో డబ్బు అనేది అసంబద్దంగా , ఉద్యోగం ఆప్షనల్‌గా మారనుందని ప్రపంచ కుబేరుడు, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. ప్రపంచ కుబేరుడు, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ వలన భవిష్యత్తులో డబ్బు అనేది అసంబద్దంగా , ఉద్యోగం ఆప్షనల్‌గా మారనుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కృత్రిమ మేధస్సు , హ్యూమనాయిడ్ రోబోలు చాలా ప్రొడక్టివ్‌గా ఉంటాయని, చివరికి డబ్బు అసంబద్ధంగా మారుతుందని, చాలా ఉద్యోగాలు ఆప్షనల్ హాబీస్‌గా మారుతాయని, పేదరికం తొలగిపోతుందని ఎలాన్ మస్క్ అన్నారు. వాషింగ్టన్లో జరిగిన యూఎస్-సౌదీ ఇన్వెస్ట్మెంట్ ఫోరమ్‌లో Nvidia CEO జెన్సెన్ హువాంగ్‌తో సంభాషణ సందర్భంగా మస్క్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. రోబోలు ఎక్కువ పని చేయడంతో, “ఆహారాన్ని కొనడానికి బదులుగా సొంతంగా పండించినట్లే పని ఆప్షనల్ అవుతుంది” అని మస్క్ అన్నారు. ప్రజలు అవసరం కంటే అభిరుచుల ఆధారంగా ఉపాధిని ఎంచుకుంటారు. రాబోయే రోజుల్లో చేయడానికి పనులేవి ఉంచబోవని మస్క్ అభిప్రాయపడ్డారు. అంతే కాదు ఏఐ వల్ల డబ్బు అవసరం కూడా పెద్దగా ఉండబోదంటూ వ్యాఖ్యానించారు. ఏఐ, రోబోటిక్స్ అనేవి పేదరికాన్ని పూర్తిగా పారదోలుతాయని మస్క్ విశ్వాసం వ్యక్తం చేశారు. పేదరికం సామాజిక సమస్య కాదని, ఇంజనీరింగ్ సమస్యగా అభివర్ణించారు. దీనిని ఆర్ఠిఫిషియల్ ఇంటెలిజెన్స్ సరిచేస్తుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. AI ప్రభావంతో ప్రపంచంలో ఉద్యోగాల స్వరూపం ఎంత వేగంగా మారిపోతుందో ఎలాన్ మస్క్ వివరించారు. మస్క్ అంచనా ప్రకారం, మరో 10 నుండి 20 సంవత్సరాల్లో మనుషుల అవసరం లేకుండానే చాలా పనులు పూర్తవుతాయి. రోబోలు, హ్యూమనాయిడ్ యంత్రాలు, ఆటోమేటెడ్ సిస్టమ్స్ అన్ని ప్రధాన పనులను చేపడతాయి. మనం ఇప్పుడు క్రీడలు ఆడటాన్ని, వీడియో గేమ్స్ ఆడటాన్ని ఎలా హాబీగా చూస్తామో, భవిష్యత్తులో ఉద్యోగం కూడా అదే తరహాలో మారవచ్చని ఆయన పేర్కొన్నారు.