తిరుమల తరహాలో అమరావతి శ్రీవారి ఆలయం సిద్ధం

* 27న సీఎం శంకుస్థాపన! * చంద్రబాబు చేతుల మీదుగా అమరావతి శ్రీవారి ఆలయానికి నూతన శోభ – భక్తుల్లో హర్షం!

పయనించే సూర్యుడు : అమరావతిలో టీటీడీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి రెండో ప్రాకారం నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ నెల 27న కార్యక్రమం నిర్వహించనున్నారు. అలాగే తిరుచానూరులో శ్రీవారి పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మ‌వారు చిన్నశేష వాహనంలో భక్తులను ఆశీర్వ దించారు. ఇటు ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అందించిన పట్టువస్త్రాలు చెందించారు. త్వరలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా తిరుచానూరు, తిరుమల సందర్శనకు రానున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని వెంకటపాలెం సమీపంలో టీటీడీ వేంకటేశ్వరస్వామి ఆలయం ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఆలయానికి రెండో ప్రాకారం నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ నెల 27న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ పనులకు శంకుస్థాపన జరగనుంది. ఉదయం 10.55 నుంచి 11.30 గంటల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. తిరుమల ఆలయం మాదిరిగానే అమరావతిలోనూ రెండో ప్రాకారం నిర్మించనున్నారు. పడమర, ఉత్తరం, దక్షిణం దిక్కుల్లో ఐదు అంతస్తులతో గాలి గోపురాలు కట్టనున్నారు. తూర్పు వైపున ఏడు అంతస్తులతో మహా రాజగోపురం నిర్మించనున్నారు. ఆలయం లోపల, మహా రాజగోపురానికి ఎదురుగా ఆంజనేయ స్వామి ఆలయం, ఉత్సవ మండపం, కోనేరు వంటివి కూడా రానున్నాయి. ఈ నిర్మాణాలతో ఆలయ వైభవం మరింత పెరగనుంది. తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల మొదటిరోజైన సోమవారం రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు పరమ వాసుదేవుడు అలంకారంలో చిన్నశేష‌వాహ‌నంపై అభ‌య‌మిచ్చారు. మొదటి వాహనం చిన్నశేషుడు. చిన్నశేష వాహనంపై అమ్మవారు జీవకోటిని ఉద్ధరించే లోకమాతగా దర్శనమిస్తారు. శేషభూతమైన ఈ ప్రపంచం సిరులతల్లి రక్షణలో సుఖాన్ని పొందుతోంది. ఈ వాహనంపై అమ్మవారి ద‌ర్శనం వ‌ల్ల యోగసిద్ధి చేకూరుతుందని భక్తుల విశ్వాసం. వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జెఈవో వీ వీర‌బ్రహ్మం, సీవీఎస్వో కే.వి.మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో హరింద్రనాథ్, ఆల‌య అర్చకులు బాబుస్వామి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనల మేరకు టీటీడీ ఆలయాల్లో అన్నప్రసాదాలు పంపిణీకి చర్యలు చేపట్టామన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలకు భక్తుల సంఖ్య పెరుగుతోందని, అందుకు తగ్గట్టుగానే చర్యలు చేపట్టామన్నారు. తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లో పంచమి తీర్థం రోజున దాదాపు 50 వేలకు పైగా భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించామన్నారు. బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా భ‌క్తుల కోసం టీటీడీ అన్ని వ‌స‌తులు క‌ల్పించింద‌న్నారు. ఈ నెల 20, 21 తేదీల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుచానూరు, తిరుమలలో శ్రీ పద్మావతీ అమ్మవారిని, శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్నారని మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *