మహిళల డబ్బులపై రాజకీయ వేడి

★ చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్.

జనం న్యూస్: మ‌న ఆడ బిడ్డ‌లు, త‌మ కుటుంబాల చ‌రిత్ర‌నే కాకుండా ఈ దేశ చ‌రిత్ర‌నే మార్చేలా శ‌క్తిమంతంగా ఎదిగేలా వారికి అండ‌గా నిలిచాం అని వైఎస్ జగన్ అన్నారు. మ‌హిళాభ్యుద‌యానికి, మ‌హిళా సాధికార‌త‌కు చంద్ర‌బాబు పాల‌న చీక‌టి కాలం. రాష్ట్రంలో న‌డుస్తున్న‌దంతా దుశ్శాస‌న ప‌ర్వం!’అంటూ వైఎస్ జగన్ ఘాటుగా విమర్శించారు. మహిళా సాధికారత అన్న పదం పలికే అర్హత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏమాత్రం లేదు అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు.‘గత మూడు రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు మూడు డ్రామాలు చూపించింది. అసెంబ్లీలో ఒక డ్రామా పగటి వేషాలు వేసుకున్న అదే ఎమ్మెల్యేతో మరో డ్రామా ఈ రెండింటికీ కొనసాగింపుగా అంతర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం నాడు చంద్ర‌బాబు నాయుడు ట్రూప్ ఆడిన‌ది ఇంకో డ్రామా!’ఆడారు అని జగన్ తీవ్రంగా మండిపడ్డారు.జ‌నాభాలో 50 శాతం ఉన్న అక్క చెల్లెమ్మ‌ల‌కు ఎన్నిక‌ల ముందు మీరిచ్చిన ఏ ఒక్క హామీని ఇప్ప‌టి వ‌ర‌కు అమ‌లు చేయలేదు అని విమర్శించారు.అయినప్పటికీ హామీలన్నీ అమలు చేసేసిన‌ట్లు విజ‌య‌వాడ‌లో అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ప‌ట్ట‌ప‌గ‌లు ఇంకో డ్రామా మొద‌లు పెట్టారని జగన్ మండిపడ్డారు. ఒక్కో అక్కచెల్లెమ్మకు రూ.54 వేలు బాకీ పడ్డారు. ‘సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ లో భాగంగా 19-59 మ‌ధ్య వ‌య‌సున్న ప్ర‌తి ఒక్క అక్క‌చెల్లెమ్మ‌కు నెల‌కు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తామ‌ని ఎన్నిక‌ల ముందు చెప్పారు. రాష్ట్రంలో 18 ఏళ్ల పైబడి, 60 ఏళ్ల లోపు ఉన్న మహిళలు ఎన్నికల కమిషన్‌ డేటా ప్రకారం కోటి 80 లక్షల మంది ఉన్నారు. వీరికి నెలకు రూ.1500 అంటే సంవత్సరానికి రూ.18 వేల చొప్పున ఒక్కో అక్కచెల్లెమ్మలకు మూడేళ్ల‌లో రూ.54 వేల చొప్పున బాకీ పడ్డారు. ఆ డ‌బ్బులు ఎప్పుడిస్తారు చంద్ర‌బాబు?’అని వైఎస్ జగన్ నిలదీశారు. ‘మ‌రో హామీ 50 ఏళ్లకే పింఛన్‌. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్క‌చెల్లెమ్మ‌ల‌కు 50 ఏళ్లు వయస్సు దాటిన వారికి నెల‌కు రూ.4వేలు చొప్పున ఒక్కొక్కరికి రూ.48 వేలు ఇవ్వాలి. మూడేళ్లలో రూ.1.44 లక్షలు బాకీ పడ్డారు. ఆ డ‌బ్బులు ఎప్పుడిస్తారు?’అని సీఎం చంద్రబాబు నాయుడును వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఎగ్గొట్టిన డబ్బులు ఎప్పుడిస్తారు? ‘బడికి వెళ్లే ప్రతి పిల్ల వాడికి ఏడాదికి రూ.15 వేల చొప్పున ఎంత మంది పిల్లలుంటే అంత మందికి త‌ల్లికి వంద‌నం కింద‌ ఇస్తామన్నారు. మొద‌టి ఏడాది పూర్తిగా ఎగ‌నామం పెట్టారు. రాష్ట్రంలో యూడీఐఎస్ఈ (యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌) ప్రకారం 2023–24 నాటికి బడికి పోయే పిల్లలు 87,41,885 మంది ఉంటే రెండో ఏడాది 20 ల‌క్ష‌ల మందికి ఎగ‌ర‌గొట్టారు. చివరకు 67.27 లక్షల మందికి మాత్రమే అది కూడా కొందరికి రూ.8 వేలు.. రూ.9 వేలు.. రూ.10 వేలు, మరి కొంత మందికి రూ.13 వేలు ఇచ్చారు. మ‌రి వీళ్లంద‌రికీ డ‌బ్బులు ఎప్పుడిస్తారు? ఎగ్గొట్టిన మొద‌టి ఏడాది డ‌బ్బులు ఎప్పుడిస్తారు?’అని వైఎస్ జగన్ నిలదీశారు. ‘సూపర్‌ సిక్స్‌లో ఉచిత గ్యాస్‌ చిన్న హామీ. ఇక్కడా కూడా మోసాలే. రాష్ట్రంలో యాక్టివ్‌గా ఉన్న గ్యాస్‌ కనెక్షన్ల సంఖ్య 1.59 కోట్లు. వీరికి ఏటా మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. సిలిండర్ ధర రూ.855 చొప్పున మూడు సిలిండర్లకు ఏడాదికి రూ.3,990 కోట్లు కేటాయించాలి. మొదటి ఏడాది కేవలం రూ.786 కోట్లు, రెండో ఏడాది రివైజ్డ్‌ ఎస్టిమేట్స్‌ ప్రకారం బడ్జెట్‌లో రూ.2,199.99 కోట్లు కేటాయించారు. 2026–27లో బడ్జెట్‌లో ఈ పథకానికి పెట్టింది రూ.2,601 కోట్లు. అంటే మొత్తంగా రూ.6,143 కోట్లు బాకీ పడ్డారు. ఆ డ‌బ్బులు ఎప్పుడు ఇస్తారు చంద్ర‌బాబు?’అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ నిలదీశారు. ఫ్రీ బస్సులో కూడా కోతలు. ‘ఉచిత బ‌స్సులో ఎక్క‌డి నుంచి ఎక్క‌డికైనా వెళ్ల‌వ‌చ్చ‌ని మ‌హిళ‌ల‌కు హామీ ఇచ్చారు. కడప నుంచి వైజాగ్‌కు పోవచ్చు. శ్రీకాకుళం వాళ్లు తిరుపతికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు. మధ్యలో కనకదుర్గమ్మను కూడా దర్శనం చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ఫ్రీ అన్నారు. ఏపీఎస్ ఆర్టీసీలో 16 రకాల సర్వీసులుంటే. కేవలం ఐదు సర్వీసులకు మాత్రమే పరిమితం చేశారు’అని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు.‘ ఈ పథకం అమలు చేయాలంటే ఏడాదికి రూ.3,200 కోట్లు ఖర్చు చేయాలి. మొదటి ఏడాది ఈ స్కీమ్‌ ఎగరగొట్టేశారు. రెండో ఏడాది ఆర్నెల్ల తర్వాత ఆగస్టులో అరకొరగా మొదలు పెట్టారు. చేసిన ఖర్చు రూ.1,040 కోట్లు. ఈ స్కీమ్‌ కోసం ఈ బడ్జెట్‌లో కేటాయించిన మొత్తం రూ.1,420 కోట్లు. అంటే మూడేళ్లలో రూ.9,600 కోట్లకు గాను రూ.2,460 కోట్లు కేటాయించారు. అంటే రూ.7,140 కోట్లు బాకీ పడ్డారు. ఆ డ‌బ్బులు ఎప్పుడిస్తారు చంద్ర‌బాబు?’అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.