
జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతులు విపత్తుల బారినపడకుండా ఉండేందుకు దృష్టి సారించిన ప్రభుత్వం రెండు నెలల ముందే ఖరీఫ్ ప్రారంభించాలని నిర్ణయించింది. ప్రస్తుతం రిజర్వాయర్లలో 90శాతం నీటి నిల్వలు ఉన్న నేపథ్యంలో మే నెలలోనే ఖరీఫ్ సీజన్ ప్రారంభిస్తే విపత్తుల నుంచి తప్పించుకోవచ్చు అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో వరి పంట సాగు విస్తీర్ణాన్ని సమతుల్యం చేస్తూ రైతులను లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటల వైపు దారితీసే స్పష్టమైన విధానాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అసెంబ్లీలో తెలిపారు.క్రాప్ డైవర్షన్, మద్దతు ధరలు, సేంద్రీయ వ్యవసాయం, కౌలు రైతుల రుణాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిస్తూ, 2025–26 క్రాప్ ఇయర్‌కు రాష్ట్రంలో వరి సాగు చేస్తున్న రైతులు మొత్తం 38.97 లక్షల మంది ఉన్నారని, అందులో ఖరీఫ్ 26.94 లక్షలు, రబీ 12.03 లక్షల మంది ఉన్నారని వెల్లడించారు. అధిక వరి సాగు ప్రాంతాల్లో భూగర్భ జలాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనె గింజల వంటి పంటలను ప్రోత్సహించేందుకు అవగాహన కార్యక్రమాలు, నాణ్యమైన విత్తనాల సరఫరా, సాంకేతిక మార్గదర్శకాలు, మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. 15లక్షల ఎకరాల్లో క్రాప్ డైవర్షన్ 2025–26 సంవత్సరానికి సర్టిఫైడ్ సీడ్ ఉత్పత్తి ప్రణాళిక అమలు చేస్తున్నామని...ఎన్ జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాల ద్వారా ఆధునిక విత్తనాలను రైతులకు అందిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, మార్కెట్ అవసరాలు, నీటి లభ్యత నేపథ్యంలో పంటల వైవిధ్యీకరణ అత్యవసరమని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతో అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తయ్యాయని, సాగునీటి లభ్యత పెరిగినప్పటికీ వరిపై అధిక ఆధారపడటం రైతులకు గిట్టుబాటు కాదని తెలిపారు. వరిని పూర్తిగా మానేయాలని ప్రభుత్వం చెప్పడం లేదని, అయితే పాత వంగడాల బదులు నాణ్యమైన, ఎగుమతులకు అనుకూలమైన కొత్త వంగడాలను ప్రోత్సహిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. మొదటి దశలో రాయలసీమ జిల్లాల నుండి ప్రకాశం జిల్లా వరకు 15 లక్షల హెక్టార్లలో క్రాప్ డైవర్షన్ చేపట్టి హార్టికల్చర్ హబ్‌లుగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు ఉచిత పామాయిల్ మెుక్కలు కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ.30,000 కోట్లు, ప్రైవేట్ రంగం ద్వారా రూ.70,000 కోట్లు సమీకరించి హార్టికల్చర్ అభివృద్ధి ప్రణాళిక రూపొందిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. సంవత్సర కాలంలో రైతులకు వరి పంటలో ఎకరాకు సుమారు రూ.6,000 ఆదాయం మాత్రమే వస్తుండగా, కంది పంటకు రూ.26,000, మినుముల పంటకు రూ.21,000, జొన్న పంటకు రూ.16,000, పామాయిల్ పంటకు రూ.1.50 లక్ష రూపాయల లాభం వస్తుందని మంత్రి వివరించారు. డైవర్షన్‌కు ముందుకొచ్చే రైతులకు పామాయిలు ఉచిత మొక్కలు, సాంకేతిక సలహాలు, డ్రిప్, స్ప్రింక్లర్ సదుపాయాలు కల్పించి, పండించిన పంటలను కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మే నెలలో ఖరీప్ ప్రారంభం అయ్యేలా చర్యలు మొక్కజొన్నకు రూ.2,400 మద్దతు ధర ప్రకటించి మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చర్యలు చేపడుతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ప్రస్తుతం రిజర్వాయర్లలో 90 శాతం నీటి నిల్వలు ఉన్నందున ఖరీఫ్ సాగును రెండు నెలలు ముందుకు తీసుకురావాలని...మే నెలలో ఖరీప్ ప్రారంభం అయ్యేలా ప్రతి గ్రామంలో ప్రత్యేక క్యాంపెయిన్లు నిర్వహిస్తున్నామని...ఎమ్మెల్యేలు రైతులకు అవగాహన కల్పించాలని మంత్రి అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. కౌలు రైతుల విషయానికి వస్తే 9.13 లక్షల మందికి సీసీఆర్సీ కార్డులు జారీ చేసి రూ.4474 కోట్లు రుణాలుగా మంజూరు చేశామని వెల్లడించారు. రైతుల ఆదాయ వృద్ధి, స్థిరమైన వ్యవసాయ అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో స్పష్టం చేశారు.