
సాక్షి డిజిటల్ న్యూస్ : భారత బ్యాడ్మింటర్ స్టార్ ప్లేయర్ పీవీ సింధు దుబాయ్ ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... భారత బ్యాడ్మింటర్ స్టార్ ప్లేయర్ పీవీ సింధు దుబాయ్ ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయారు. ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ఇరాన్ ప్రతీకర దాడులకు దిగింది. ఇరాన్ ప్రతీకార దాడులు గల్ఫ్ దేశాలు, మిడిల్ ఈస్ట్‌లో మరింత టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే శనివారం మిడిల్ ఈస్ట్ అంతటా విమానయాన సంస్థలు విమానాలను నిలిపివేసాయి విమాన-ట్రాకింగ్ మ్యాప్‌లు మిడిల్ ఈస్ట్‌లోని చాలా ప్రాంతాలపై గగనతలం దాదాపుగా ఖాళీగా ఉన్నట్లు చూపించాయి. అయితే ఈ పరిస్థితులలో ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ కోసం ఇంగ్లాండ్ వెళ్తున్న పీవీ సింధు... దుబాయ్ ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయారు. ఈ విషయాన్ని పీవీ సింధు స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించారు. ‘‘తదుపరి నోటీసు వచ్చేవరకు అన్ని విమానాలు నిలిపివేయబడ్డాయి’’ అని పీవీ సింధు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఆ తర్వాత కాసేపటికి మరో అప్‌డేట్ ఇస్తూ... తాను క్షేమంగా ఉన్నానని పీవీ సింధు తెలిపారు. అయితే దుబాయ్ ఎయిర్‌పోర్టులో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. ‘‘ఈ పరిస్థితి కొనసాగుతూనే ఉంది. పరిస్థితి గంట గంటకు మరింత భయానకంగా మారుతోంది. కొన్ని గంటల క్రితం విమానాశ్రయంలో మేము చిక్కుకున్న ప్రదేశానికి దగ్గరగా పేలుడు సంభవించింది. నా కోచ్ పొగ, శిధిలాలకు దగ్గరగా ఉండటంతో ఆ ప్రాంతం నుంచి పరుగులు తీశారు. ఇది మా అందరికీ చాలా ఉద్రిక్తమైన, భయానకమైన క్షణం. ఇప్పుడు మేమంతా సురక్షితంగా ఉన్నాము. దుబాయ్ విమానాశ్రయంలోని సిబ్బంది, దుబాయ్ అధికారుల చేస్తున్న కృషికి ధన్యవాదాలు. ఇప్పుడు మేము మరింత సురక్షితమైన ప్రదేశానికి వెళ్లాం. మమ్మల్ని సురక్షితంగా ఉంచడంలో వారు ఎంతో అద్భుతమైన సాయం అందించారు. దుబాయ్‌లోని భారత హైకమిషన్‌కు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రస్తుతానికి మేము కొంత విశ్రాంతి తీసుకోవడానికి సమయం లభించింది’’ అని పీవీ సింధు సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. దుబాయ్ మిడిల్ ఈస్ట్‌లో అతిపెద్ద పర్యాటక, వాణిజ్య కేంద్రంగా ఉంది. దుబాయ్ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ప్రయాణ కేంద్రాలలో ఒకటిగా ఉంది. ప్రస్తుతం ఇక్కడి విమానాశ్రయంలో పీవీ సింధుతో పాటు వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. అయితే ఈ పరిణామాలపై పీవీ సింధు తండ్రి రమణ స్పందించారు. రమణ ఏఎన్‌ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ... ‘‘నేను ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నా కూతురితో మాట్లాడాను. భారత రాయబార కార్యాలయం ఆమెను జాగ్రత్తగా చూసుకుంటుందని... తనను ఒక హోటల్‌లో ఉంచిందని ఆమె చెప్పింది’’ అని అన్నారు.