బాధిత కుటుంబాలకు రూ.20 లక్షలు ఆర్థిక సహాయం

★ ప్రకటించిన సీఎం చంద్రబాబు.

జనం న్యూస్: కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన ఘోర బాణసంచా ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.20 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని స్పష్టం చేశారు. అదనంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందుతుందని వెల్లడించారు. శనివారం రాత్రి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్‌)లో చికిత్స పొందుతున్న గాయపడిన వారిని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనను అత్యంత దురదృష్టకరమని సీఎం చంద్రబాబు అభివర్ణించారు. మృతుల్లో 12 మంది ఎస్సీలు, 8 మంది మహిళలు ఉన్నారని తెలిపారు. బాధితులంతా ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందినవారేనని పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రమాదంలో దంపతులు కూడా మృతి చెందారని తెలిపారు. వారి పిల్లలకు రెసిడెన్షియల్ పాఠశాలలో ఉచిత విద్య అందిస్తామని హామీ ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు అధికారులపై సస్పెన్షన్: బాణసంచా తయారీలో ఉపయోగించే రసాయనాలు అత్యంత ప్రమాదకరమని, భద్రతా చర్యల్లో నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సాంకేతిక కోణంలో కూడా విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనకు బాధ్యులుగా భావిస్తూ ఆర్డీవో, డీఎస్పీ, జిల్లా కార్మికశాఖ అధికారి, అగ్నిమాపకశాఖ అధికారిని సస్పెండ్ చేసినట్లు ఆయన వెల్లడించారు. పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం మరికొంత మందిపై కూడా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. సంబంధిత యజమానిని ఎక్కడ ఉన్నా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే ఆస్తులు జప్తు చేసి బాధితులకు అందజేస్తామన్నారు. చిన్ననాటి నుంచే అక్కడ పని చేస్తున్నారు: బాధితులలో చాలా మంది చిన్ననాటి నుంచే అక్కడే పనిచేస్తున్నట్లు తెలిపారని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రోజుకు రూ.700 వేతనం లభిస్తుండటంతో ఈ పనిని కొనసాగిస్తున్నారని, ఇతర ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్నాయని వారు వివరించారని తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద 125 రోజులు పని కల్పిస్తున్నామని భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా పర్యవేక్షణ చేపడతామని స్పష్టమైన హామీ ఇచ్చారు. ప్రోటోకాల్ పక్కనపెట్టిన సీఎం చంద్రబాబు: విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్నప్పటికీ ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే సీఎం వేట్లపాలెం చేరుకున్నారు. సాధారణంగా ఎస్పీజీ ప్రత్యేక భద్రతా వాహనంలో ప్రయాణించే ఆయన, సామర్లకోట చేరుకున్న తర్వాత కలెక్టర్ వాహనంలోనే మట్టిరోడ్డుపై ఘటనాస్థలానికి చేరుకున్నారు. చీకటిపడ్డప్పటికీ అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. అధికారులతో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సామర్లకోట ప్రభుత్వాసుపత్రి మార్చురీకి వెళ్లారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి, తరువాత కాకినాడ జీజీహెచ్‌కు వెళ్లి గాయపడిన వారిని పరామర్శించారు. వ్యవసాయంలో ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో బాణసంచా తయారీ పనుల్లోకి వెళ్లాల్సి వస్తోందని, ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని బాధిత కుటుంబాలు సీఎంను కోరాయి.