AI రంగంలో భారత్ ఆధిపత్యం-ప్రపంచానికి మనమే మార్గదర్శకులం

★ ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

పయనించే సూర్యుడు న్యూస్ : ఇటీవల భారత్ మండపంలో నిర్వహించిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌ గురించి ప్రధాని మోదీ ప్రస్తుతించారు. 100కి పైగా దేశాలు, పెద్ద కార్పొరేట్‌లు నుంచి చిన్న స్టార్టప్‌ల వరకు అందరూ ఒకే వేదికపైకి వచ్చారని, ఇది భారత్‌కి గౌరవ క్షణమని వివరించారు. ఢిల్లీలో ఫిబ్రవరి 27 న్యూస్18 అధ్వర్యంలో నిర్వహించిన రైజింగ్ భారత్ సమ్మిట్ 2026లో ప్రధాని నరేంద్ర మోదీ ఇండియా ఏఐ టెక్నాలజీపై కీలక వ్యాఖ్యలు చేశారు. "Strength Within" (అంతర్గత బలం) అనే థీమ్‌తో జరిగిన ఈ సదస్సులో పీఎం మోదీ.. భారత దేశ స్వయం సమృద్ధి, టెక్నాలజీలోని మార్పు, ఏఐ రంగంలో దేశం సాధిస్తున్న అభివృద్ధిని వివరించారు. పీఎం మోదీ తన ప్రసంగంలో చెప్పిన ప్రధాన అంశం: గత పారిశ్రామిక విప్లవాలన్నింటిలోనూ భారత్, ప్రపంచ దేశాలను అనుసరిస్తూ వచ్చేదనీ.. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) యుగంలో మాత్రం భారత్.. ప్రపంచ దేశాల నిర్ణయాల్లో భాగస్వామిగా ఉండటమే కాకుండా నిర్ణయాలను రూపొందిస్తోంది కూడా ఆయన గర్వంగా ప్రకటించారు. "నేడు మనకు మన స్వంత AI స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ ఉంది. డేటా సెంటర్లలో పెట్టుబడి పెట్టడానికి బలం ఉంది. AI డేటాను నిల్వ చేయడానికీ, ప్రాసెస్ చేయడానికీ అత్యంత అవసరమైన ఎనర్జీ కోసం మనం వేగంగా పని చేస్తున్నాము. అణు విద్యుత్ రంగంలో మనం చేసిన సంస్కరణలు భారతదేశ AI పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి కూడా సహాయపడతాయి" అని మోదీ స్పష్టంగా అన్నారు. ఇటీవలే ఇదే భారత్ మండపం భవనంలో నిర్వహించిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌ను ప్రధాని మోదీ ఉదాహరణగా చూపించారు. 100కి పైగా దేశాలు, పెద్ద కార్పొరేట్‌ల నుంచి చిన్న స్టార్టప్‌ల వరకు అందరూ ఒకే వేదికపైకి వచ్చారనీ, ఇది భారత్‌కి గౌరవ క్షణమని మోదీ వివరించారు. ఇంతకుముందు భారత్ టెక్నాలజీని కేవలం వినియోగించేదనీ.. , ఇప్పుడు టెక్నాలజీ సృష్టికర్తగా మారిందనీ, ఇది దేశ అంతర్గత బలానికి నిదర్శనమని ప్రధాని మోదీ అన్నారు. ఈ ప్రసంగంలో ప్రధాని మోదీ.. భారత్ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అయిన జన్‌ధన్, ఆధార్, మొబైల్ UPI, సోలార్ పవర్, మెట్రో నెట్‌వర్క్, వందే భారత్ వంటి విజయాల్ని హైలెట్ చేశారు. ఏఐ రంగంలో సెమీకండక్టర్ ఎకోసిస్టమ్, డేటా సెంటర్లు, న్యూక్లియర్ రిఫామ్స్ ద్వారా ఎనర్జీ సరఫరాని పెంచడం వంటి చర్యలు 2047 వికసిత్ భారత్ లక్ష్యానికి మార్గం సుగమం చేస్తాయని పీఎం సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఏఐ సమ్మిట్‌ను వ్యతిరేకించడాన్ని తీవ్రంగా విమర్శించిన మోదీ, దేశం ముందు విదేశీ అతిథుల సమక్షంలో ఇలాంటి చర్యలు దేశ గౌరవాన్ని దెబ్బతీస్తాయని అన్నారు. అయితే దేశ ప్రజలు ఇలాంటి వ్యతిరేకతను తిరస్కరిస్తున్నారని స్పష్టం చేశారు. భారత్ ఇప్పుడు ఏఐలో గ్లోబల్ లీడర్‌గా ఎదుగుతోంది. స్టార్టప్ ఎకోసిస్టమ్, డేటా సెంటర్లు, న్యూక్లియర్ పవర్ రిఫామ్స్ ద్వారా ఏఐ డేటా ప్రాసెసింగ్ కోసం అవసరమైన ఎనర్జీని స్వయం సమృద్ధిగా ఉత్పత్తి చేయడం.. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇది యువతకు ఉద్యోగాలు, స్టార్టప్‌లకు అవకాశాలు కల్పిస్తుంది. పీఎం మోదీ ప్రసంగం భారత దేశం మానసిక బానిసత్వం నుంచి విముక్తి పొంది స్వాభిమానంతో ముందుకు సాగాలనే సందేశం ఇస్తోంది.