
సాక్షి డిజిటల్ న్యూస్ :పేదలే ఇందిరమ్మ ప్రభుత్వం పేటెంట్ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. వెలుగుమెట్లలో 2023లో ఇళ్లు కూలగొట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని చెప్పుకొచ్చారు. బాధితులకు ఇంటిస్ధలం, ఇళ్లు ఇచ్చే బాధ్యత మాది అని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ ప్రగతిని చూడలేని కేసీఆర్ మరియు కో విష ప్రచారం చేస్తోంది అని మండిపడ్డారు. వరుస ఎన్నికల్లో ప్రజల బుద్ది చెబుతున్నా మారని బీఆర్ఎస్ వైఖరి కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో బీఆర్ఎస్ అవినీతికి బిజేపీ సహకారం అందిస్తోంది అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటివరకు జరిగిన పార్లమెంటు, ఉప ఎన్నికలు, పంచాయితీరాజ్, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టడాన్ని జీర్ణించుకోలేక ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నారని, దీనికి మరోవైపు బిజేపీ నేతలు వంతపాడుతున్నారని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట స్వామి ఆరోపించారు. గురువారం నాడు సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ బలరాం నాయిక్, రామ సహాయం రఘుమారెడ్డి, ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, మాధవరెడ్డితో కలసి మాట్లాడారు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 2023 జూలై 15న వెలుగుమట్లలో నాటి బిఆర్ఎస్ ప్రభుత్వమే పేదల ఇండ్లను కూలగొట్టించిందని చెబుతూ నాడు కూల్చివేత సంఘటనల ఫోటోలను ప్రదర్శించారు.అంతేగాక వెలుగుమెట్లలో పేదలకు ఇండ్లు తిరిగి కట్టిస్తామని హామీ ఇచ్చి గాలికి వదిలేసింది. కానీ ఇందిరమ్మ ప్రభుత్వం హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా అక్కడ అక్రమంగా ఉన్న ఇండ్లను తొలగించడం జరిగింది అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పేదలే ఇందిరమ్మ ప్రభుత్వం పెటెంట్ ‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు అక్కడ అర్హులైన పేదలకు ఇంటి స్ధలం, ఇళ్లు ఇస్తాం.పేదలే ఇందిరమ్మ ప్రభుత్వం పెటెంట్’అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు. ‘ఈవిషయంలో నిజంగా పేదలపై బిఆర్ఎస్ బావ మరుదులు, ఫాంహౌస్‌లో ఉండి కుట్రలు చేస్తున్న కేసీఆర్ వెంటనే స్పందించి కాళేశ్వరంలో దోచుకున్న...దాచుకున్న సొమ్ములో కొంత భాగాన్ని బయటకు తీసి పేదలకు ఇళ్లు కట్టించి పాప పరిహారం చేసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్‌ను కాదని కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను చేపట్టి ఎనిమిదవ వింతగా ప్రచారం చేసుకుంది అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే లక్షలాది కోట్ల ప్రాజెక్ట్ కట్టడం, అవినీతి కారణంగా బీటలువారడం కూడా జరిగింది. నాలుగేళ్లలో 168 టిఎమ్‌సీ నీరు ఇస్తామని చెప్పి దీనిలో 50 టిఎంసీల నీటిని సముద్రం పాలుచేశారు’అని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్‌తో చేతులు కలిపిన బీజేపీ ‘కాళేశ్వరం ప్రాజెక్ట్ బీఆర్ఎస్‌కు ఎటీఎం గా మారిందన్న బీజేపీ నేతలు బీఆర్ఎస్‌తో చేతులు కలిపారు. జస్టిస్ ఘోష్ కమీషన్ నివేదిక ఇచ్చినా...అసెంబ్లీలో తీర్మానం చేసి సీబీఐకి ఇచ్చినా ఇంతవరకు కేంద్రం కనీసం స్పందించలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో వదిలేసిన ప్రాజెక్ట్ లను మేం పూర్తి చేస్తున్నాం’అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు. ‘16 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీకి కేసీఆర్, బావ బావమరుదులు వచ్చి మాట్లాడాలి. వారు గతంలో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. మేం ఖచ్చితంగా అవకాశం ఇస్తాం. వచ్చి మంచి సలహాలు, సూచనలు ఇవ్వాలి’అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు.