ఇజ్రాయెల్ పర్యటన విజయవంతం

★ ఇజ్రాయెల్‌తో ఆర్థిక, రక్షణ సహకారంపై కీలక ఒప్పందాలు

పయనించే సూర్యుడు న్యూస్ : భారత్, ఇజ్రాయెల్ డీల్ సూపర్ హీట్ అయ్యింది. ఈ చర్చలతో ఇరుదేశాల బంధం మరోసారి ప్రతిబింబించింది. ముగింపు సభలో ఇజ్రాయోల్ ప్రధానీ చేసిన వ్యాఖ్యలు భారతీయులకు ఆసక్తిని, ఆనందాన్ని ఇచ్చాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన విజయవంతంగా ముగిసింది. గురువారం జెరూసలేంలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో ముఖ్యమైన చర్చలు జరిపారు మోదీ. ఈ సమావేశంలో రక్షణ, అంతరిక్ష, సైబర్ భద్రత, జల నిర్వహణ వంటి కీలక రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. భారత్–ఇజ్రాయెల్ మధ్య పలు ముఖ్య ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. చర్చల అనంతరం రెండు దేశాల ప్రధానులు సంయుక్త ప్రెస్ కాన్ఫరెన్స్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వారి సమక్షంలో అనేక కీలక అవగాహన ఒప్పందాలు (MoUs) పరస్పరం మార్పిడి అయ్యాయని తెలిపారు. కృత్రిమ మేధస్సు, యూపీఐ రంగాల్లో ఒప్పందాలు మోదీ, నేతన్యాహూ సమక్షంలో భారత్–ఇజ్రాయెల్ మధ్య పలు ముఖ్యమైన అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) రంగంలో పరస్పర సహకారానికి ఇరు దేశాలు అంగీకరించాయి. అలాగే ఆర్థిక అనుసంధానాన్ని బలోపేతం చేసేందుకు యూపీఐ (UPI) సంబంధిత అవగాహన ఒప్పందం కూడా మార్పిడి అయింది. భారత రాయబారి జేపీ సింగ్ ఇజ్రాయెల్ ప్రతినిధులతో కలిసి ఈ ఒప్పందాల పత్రాలను పంచుకున్నారు. ఈ నిర్ణయాలు ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త దిశను చూపనున్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. నేతన్యాహూ భావోద్వేగ ప్రసంగం: పర్యటన ముగింపు సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ భావోద్వేగ ప్రసంగం చేశారు. ఈ పర్యటనను ఆయన  ‘అద్భుతమైనది’గా అభివర్ణించారు.  నిన్న (బుధవారం) రోజు ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో ప్రధాని మోదీ చేసిన ప్రసంగం ప్రతి ఇజ్రాయెల్ పౌరుడి కళ్లలో నీళ్లు తెప్పించిందని ఆయన అన్నారు. ఈ పర్యటన కేవలం రెండు దేశాల మధ్య ఒప్పందాలకే పరిమితం కాలేదని, ఇది రెండు మహత్తర మేధస్సులూ, హృదయాలూ కలిసిన సందర్భమని ఆయన వ్యాఖ్యానించారు. తన దూరదృష్టిని వివరిస్తూ నేతన్యాహూ ‘ప్రెసిషన్ అగ్రికల్చర్’,  ‘ప్రెసిషన్ ఎడ్యుకేషన్’ భావనలను ప్రస్తావించారు. వ్యవసాయంలో ప్రతి మొక్కకు అవసరమైనంత నీటిని అందించినట్లే, కృత్రిమ మేధస్సు,  సాఫ్ట్‌వేర్ సాయంతో ప్రతి విద్యార్థి ప్రతిభను మెరుగుపరచవచ్చని ఆయన వివరించారు. భారత యువత ప్రతిభ, ఇజ్రాయెల్ ఆవిష్కరణ సామర్థ్యం కలిసినప్పుడు గతంలో మనలను ఆపిన అడ్డంకులను అధిగమించగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ప్రణాళికలను కార్యరూపంలోకి తీసుకురావడానికి త్వరలోనే భారత్‌లో ‘జీ-టు-జీ’ (ప్రభుత్వం-ప్రభుత్వం) స్థాయి సమావేశం నిర్వహిస్తామని కూడా ప్రకటించారు. భారత్‌తో ప్రత్యేక అనుబంధం ప్రసంగం ముగింపులో నేతన్యాహూ వ్యక్తిగతమైన, ఆసక్తికరమైన అంశాన్ని పంచుకున్నారు. తాను భారత్‌కు వ్యక్తిగతంగా ఋణపడి ఉన్నానని పేర్కొన్నారు. “నేను మొదటిసారి సారా (తన భార్య)ను కలిసినప్పుడు, మా మొదటి లేదా రెండో సమావేశం టెల్ అవీవ్‌లోని ఒక భారతీయ రెస్టారెంట్‌లో జరిగింది” అని ఆయన గుర్తుచేసుకున్నారు. అక్కడి వంటకాలు మంచి రుచికరంగా ఉండేవని, సారాకు అది తొలి అనుభవమని చిరునవ్వుతో చెప్పారు. ప్రధాని మోదీని తన ‘ప్రియ మిత్రుడు’గా పేర్కొంటూ, వ్యక్తిగత స్నేహబంధం,  ప్రభుత్వాల మధ్య ఉన్న ఈ సంబంధం భవిష్యత్తులో మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.