
జనం న్యూస్: వైఎస్ జగన్ తన పొలిటికల్ స్ట్రాటజీ మార్చారా? 2029 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా గేర్ మార్చారా? గత ఎన్నికల్లో ఓటమికి గల కారణాలపై పోస్టుమార్టం నిర్వహించిన జగన్ రాబోయే ఎన్నికల్లో వాటిని సరిదిద్దుకునే పనిలోపడ్డారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జగన్2.0లో భాగంగా జగన్ పార్టీ కార్యకర్తలకు పెద్దపీట వేయాలని డిసైడ్ అయ్యారు. అలాగే సీనియర్ రాజకీయ నాయకులతో మమేకమై వారి సూచనలు, సలహాలు తీసుకుని ముందుకు వెళ్తున్నారనేప్రచారం వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో అఖండ విజయం సొంతం చేసుకున్న వైఎస్ జగన్ 2024 ఎన్నికల ఫలితాలతో ఒక్కసారిగా ఖంగుతున్నారు. 151 సీట్లతో గెలుపొందిన వైసీపీ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అంటే ఐదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అవ్వడం జగన్‌తో పాటు పార్టీ నేతలను కలవరపాటుకు గురి చేస్తోంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోకపోవడం వైఎస్ జగన్‌కు మింగుడుపడని అంశం.ఈ క్రమంలో గత ఎన్నికల్లో ఓడిపోవడానికి గల కారణాలపై పోస్టుమార్టం నిర్వహించుకున్న వైఎస్ జగన్ వాటన్నింటిని అధిగమించుకుంటూ అడుగులు వేయాలని నిర్ణయించుకున్నారు.జగన్ 2.0లో వాటన్నింటిని సరిచేసుకుంటూనే 2029లో అధికారంలోకి రావడమే లక్ష్యంతో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది.ఈ నేపథ్యంలో జగన్ ఏం చేయబోతున్నారు? ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? అనేది తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. 2.0 కోసం జగన్ వ్యూహం వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ 2029 ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపొందడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు.అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను వైసీపీ అధినేత జగన్ పట్టించుకోలేదు అనే టాక్ ఉంది. అంతేకాదు జగన్ అధికారంలో ఉన్నప్పుడు కనీసం రాజకీయ సీనియర్లను కానీ తన తండ్రి దగ్గర నుంచి తమ కుటుంబానికి ఎంతో ఆప్తులుగా ఉండే నాయకులతో సైతం అంటీ ముట్టనట్లుగా వ్యవహరించారు. ఇవే 2024 ఎన్నికల్లో ఓటమికి ప్రధాన కారణాలు అంటూ చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కార్యకర్తలకే పెద్దపీట వేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికీ పార్టీ పదవులను సైతం కట్టబెడుతున్న సంగతి తెలిసిందే. ఒకవైపు కార్యకర్తలను దగ్గరకు చేర్చుకోవడంతోపాటు తమ కుటుంబానికి అత్యంత ఆప్తులు. సీనియర్ పొలిటీషియన్స్. మేధావులతో జగన్ టచ్‌లోకి వెళ్తున్నారనే ప్రచారం పొలిటికల్ సర్కిల్లో జోరుగా సాగుతుంది. సీనియర్ పొలిటీషియన్స్‌తో టచ్‌లోకి జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చాలా మంది సీనియర్లు మౌనం వహిస్తున్నారు. మాజీమంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, కాకాణి గోవర్థన్ రెడ్డి మినహా మిగిలిన వారెవరూ అంతగా స్పందించడం లేదు. అడపాదడపా నేనున్నానంటూ మాజీమంత్రి రోజా అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నారు. మరికొంతమంది అయితే మౌన వ్రతం చేస్తున్నారు. ఇంకొందరైతే వ్యాపారలావాదేవీలు నిర్వహిస్తున్నారు. దీంతో పార్టీ వాయిస్‌ను బలంగా వినిపించే నాయకులు కరువు అయ్యారు. కనీసం పార్టీని ముందుకు తీసుకెళ్లే అంశంపై కూడా చర్చించేందుకు పట్టుమని పది మంది సీనియర్ నేతలు కూడా అందుబాటులో ఉండటం లేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.